
సంస్కృతానికి బదులు తెలుగు ప్రశ్నపత్రం
ఇల్లెందు: పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని సుదిమళ్ల గురుకులంలో ఇంటర్ పరీక్షకు హాజరైంది. ఆమె ద్వితీయ భాష సంస్కృతం కాగా, హాల్‌టికెట్‌లో తెలుగు అని ప్రింట్ అయింది. పరీక్ష నిర్వాహకులు దాని ప్రకారం తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని బాలిక నిర్వాహకుల దృష్టికి తేగా.. వారు వెంటనే సదరు కళాశాలకు సమాచారం అందించి వివరాలు తెలుసుకున్నారు. హాల్‌టికెట్‌లో తప్పిదం జరిగిందని గ్రహించి తిరిగి సంస్కృత ప్రశ్నపత్రం అందజేశారు. ఈ విషయమై గురుకులం ప్రిన్సిపాల్ రత్నకుమారిని వివరణ కోరగా హాల్‌టికెట్‌లో జరిగిన తప్పిదాన్ని గ్రహించి సంస్కృతం పేపర్ ఇచ్చామని చెప్పారు.
ఉద్యోగం ఇప్పించాలంటూ దివ్యాంగుడి భిక్షాటన
మణుగూరు టౌన్ : మున్సిపాలిటీలో వాల్ ఆపరేటర్‌గా పనిచేసే తనను ఉద్యోగం నుంచి అకారణంగా తొలిగించారని, తిరిగి ఉద్యోగం ఇవ్వాలని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని విఠల్‌రావు నగర్‌కు చెందిన దివ్యాంగుడు రావుల కుమారస్వామి పూలమార్కెట్ చౌరస్తాలో భైఠాయించి యాచిస్తూ నిరసన తెలియజేశాడు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ దివ్యాంగుడిని పిలిపించి 15వ తేదీ కల్లా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించాడు. తనను మున్సిపాలిటీలోని కొందరు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
నిర్దేశిత లక్ష్యాలను
పూర్తి చేయాలి
డీఆర్‌డీఓ విద్యాచందన
చుంచుపల్లి: ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరినందున బ్యాంక్ లింకేజీ రుణాలు, దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ వంటి లక్ష్యాలను పూర్తి చేయాలని డీఆర్‌డీఓ విద్యాచందన సిబ్బందికి సూచించారు. సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ బుధవారం డీఆర్‌డీఓ, సెర్ప్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఆ తర్వాత విద్యాచందన జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ, పాత బకాయిల రికవరీ, దివ్యాంగులకు స్మార్ట్ కార్డుల జారీ, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
ఆస్పత్రిలో వసూళ్ల
ఆరోపణపై విచారణ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణి.. ఆస్పత్రి సిబ్బందితో తాను ఎదుర్కొన్న సమస్యలపై వాట్సప్‌లో ఫిబ్రవరి 6వ తేదీన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం విదితమే. మణుగూరు మండలానికి చెందిన గర్భిణి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం రాగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆమెతో ప్రవర్తించిన తీరు, ప్రసవ సమయాన ప్రతీ చిన్న పనికి కూడా లంచం ఇవ్వాల్సిందేనని, లేకుంటే సిబ్బంది రోగుల పట్ల వ్యవహరించిన తీరుపై ఫిబ్రవరి 7న డీసీహెచ్‌ఎస్ రవిబాబు ఆదేశాల మేరకు బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు రెండు రోజుల పాటు విచారణ చేసి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి మంగళవారం మణుగూరు వెళ్లి బాధితురాలిని కలిసి ఘటనపై ఆరా తీసి వివరాలు నమోదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఘటన చోటుచేసుకున్న సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు, సిస్టర్లు, శానిటేషన్, పేషెంట్ కేర్, ఓటీ అసిస్టెంట్‌తో పాటు ఇతర సిబ్బందితో లిఖిత పూర్వక స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు.
రెండు బైక్‌లు ఢీ :
ఐదుగురికి గాయాలు
పాల్వంచరూరల్: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురికి గాయాలైన ఘటన మండలంలోని జగన్నాథపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎం.భగవాన్‌కు కాలు విరగగా, మరో బైక్‌పై వస్తున్న భార్యాభర్తలు ఎం.శ్రీనివాస్, సుబ్బలక్ష్మి, పిల్లలు అంజలి, నాగలక్ష్మి గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంస్కృతానికి బదులు తెలుగు ప్రశ్నపత్రం
Comments
Please login to add a commentAdd a comment