
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆందోళన
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి బుధవారం మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం తెలగరామవరానికి చెందిన చంద్రగిరి సత్యనారాయణ(65)కు మంగళవారం కడుపునొప్పి రాగా కుటుంబసభ్యులు సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సత్యనారాయణ బుధవారం మృతి చెందాడు. దీంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్షం వల్లే తమ అన్న మరణించాడని సత్యనారాయణ సోదరుడు హరికృష్ణ ఆరోపించారు. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. గురువారం పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని, ఈ ఘటనపై సత్యనారాయణ కుటుంబసభ్యులు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్సై పురుషోత్తం తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి..
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామశివారులో మంగళవారం అర్ధరాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో సున్నం బాలరాజు(41) అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న బండ్ల ముత్తయ్యకు కాలు విరిగింది. సమాచారం అందుకున్న సీఐ అశోక్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. బాలరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలరాజు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతిరావు కేసు నమోదు చేశారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
మణుగూరు టౌన్: మండలంలోని బెస్తగూడెం గ్రామానికి చెందిన చింతల చినరాములు ఇల్లు బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.15వేల నగదుతో పాటు సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రభుత్వం తమకు సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment