
గద్దైపెకి పగిడిద్దరాజు
గుండాల: గుట్ట నుంచి తీసుకొచ్చిన పగిడిద్దరాజు గర్భగుడిలో పూజలందుకుని గద్దెనెక్కాడు. డోలి చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పగిడిద్దరాజును గద్దైపె ప్రతిష్ఠించారు. మేడారం సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామానికి చెందిన పూజారులు, వడ్డెల ఆధ్వర్యంలో పగిడిద్ద రాజును గుట్టనుంచి పగడాలను(జెండాలు) స్థానిక గద్దెల వద్దకు చేర్చారు. ముందుగా గర్భగుడి వద్ద ఆభరణాలకు, శివ సత్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును డప్పువాయిద్యాలు, గిరిజన నృత్యాలతో ఊరేగింపుగా గద్దెల వద్దకు చేర్చి ప్రదక్షిణలు చేసి, ప్రత్యేక పూజలతో గద్దెలపై ప్రతిష్ఠించారు. గురువారం వనం(దేవత) రాకతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం గ్రామంలో జోగుకు వెళ్లి, అదే రాత్రి దేవతలకు గంగాస్నానం చేయిస్తారు. పగిడిద్దరాజు–సమ్మక్క దేవతలకు నాగవెళ్లి జరుపుతారు. శుక్రవారం తెల్లవారుజామున గుడి మెలిగి, దేవతలకు శ్రేలపెయ్యను హారంగా ఇస్తారు. ఉదయం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం తిరిగి దేవతను గుట్టకు చేర్చడంతో జాతర ముగుస్తుంది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పూజారులు లక్ష్మినర్సు, లచ్చుపటేల్, పెద్ద కాంతారావు, చిన్న కాంతారావు, సత్యం, లక్ష్మయ్య, సమ్మయ్య, సత్యం, బిక్షం తదితరులు పాల్గొన్నారు.
యాపలగడ్డలో జాతర ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment