ఇసుకపై ఫోకస్ !
● అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా బాస్‌ల చర్యలు ● పలు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌ల ఏర్పాటు ● ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక నిఘా
బూర్గంపాడు: మొన్నటి వరకు మూడు లారీలు.. ఆరు ట్రాక్టర్లుగా సాగిన ఇసుక అక్రమ రవాణాపై పోలీస్ శాఖ నజర్ పెట్టింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ రంగంలోకి దిగారు. ఇటీవల వారు ఇసుక రీచ్‌ల్లో తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా పోలీస్ బాస్ స్వయంగా రంగంలోకి దిగడంతో మండల, డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. మొన్నటి వరకు కొన్ని మండలాల్లో చూసీచూడనట్లుగా వ్యవహరించిన పోలీస్ అధికారులు ఇప్పుడు గట్టి నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు.
చెక్‌పోస్టుల్లో నిశిత పరిశీలన..
కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చేంతవరకు అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమై ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. కలెక్టర్, ఎస్పీ చర్ల మండలంలోని ఇసుక రీచ్‌లను పరిశీలించారు. పరిమితికి మించి ఇసుక రవాణా చేయకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వే బిల్లులు నిశితంగా పరిశీలించేందుకు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసులకు డ్యూటీ వేసి రేయింబవళ్లు నిఘా పెంచారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల, డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, ఇసుక అక్రమంగా తరలించే వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. గోదావరి, కిన్నెరసాని పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, పాల్వంచ, ముల్కలపల్లి, అశ్వారావుపేట మండలాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
కందకాలు తవ్వించి..
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతాల్లో కందకాలు తవ్వించారు. గతంలో కూడా ఇలా తవ్వినా.. అక్రమార్కులు వాటిని పూడ్చి ఇసుక తరలించేవారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల నిఘాతో కందకాల పూడ్చివేతకు వెనుకాడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాతో రూ.లక్షలు ఆర్జిస్తున్న వారికి అధికారుల చర్యలు మింగుడు పడటం లేదు. దీంతో కొందరు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మండల స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. అయితే అక్రమ రవాణాను అడ్డుకోవాలని సీఎం ఆదేశించడంతో ప్రజాప్రతినిధులు కూడా అధికారులపై ఒత్తిడి చేయలేకపోతున్నారు.
15 రోజుల్లో 66 మందిపై కేసులు..
జిల్లాలో గత 15 రోజుల వ్యవధిలో పలు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 34 వాహనాలను సీజ్ చేసిన అధికారులు.. 66మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో నదులు, వాగుల నుంచి అక్రమంగా రవాణా చేసేందుకు పలువురు భయపడుతున్నారు. అయితే గతంలో అక్రమంగా నిల్వచేసిన రాశుల నుంచి రాత్రిళ్లు అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. ఇలా జిల్లాలో భారీగా ఇసుక అక్రమ నిల్వలున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టి పెడితే అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. మండల, డివిజన్ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
– రోహిత్ రాజ్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment