కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రామయ్య సన్నిధిలో ఎంపీ..
శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ బుధవారం దర్శించుకున్నారు. అనంతరం శ్రీరామనవమి ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ఈఓ రమాదేవితో సమీక్షించారు.
రేపు జాబ్‌మేళా
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పాన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపొలో ఫార్మసీలో 50 పోస్టుల భర్తీకి కంపెనీ బాధ్యులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఫార్మసిస్ట్, ట్రెయినీ ఫార్మసిస్టులు, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారని, అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
‘పది’ పరీక్షలపై
ఆకాశవాణిలో అవగాహన
చుంచుపల్లి: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సబ్జెక్ట్ నిపుణులతో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రోగ్రాం హెడ్ బైరి శ్రీనివాసన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిన తీరు, మంచి మార్కులు సాధించేలా చదవడంలో మెళకువలు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు 6వ తేదీన తెలుగు, 7న హిందీ, 10న ఇంగ్లిష్, 11న గణితం, 12న ఫిజికల్ సైన్స్, 13న బయోలాజికల్ సైన్స్, 15న సాంఘిక శాస్త్రం నిపుణులు ఉదయం 10 గంటలకు సూచనలు చేస్తారని వెల్లడించారు.
ఈనెల 10న ఇంటర్వ్యూలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ విడుదల చేసిన మొదటి ఎక్స్‌టర్నల్ నోటిపికేషన్‌కు సంబంధించి టెక్నికల్ పరీక్షలు గతేడాది జూన్‌లో నిర్వహించిన విషయం విదితమే. ఆ పరీక్షలో మెరిట్ సాధించిన కొంతమంది జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వగా మిగిలిన మరో 36 మందికి ఈనెల 10వ తేదీన కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. సంబంధిత అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించామని పేర్కొంది.
సౌర విద్యుత్ ప్లాంట్లకు 139 దరఖాస్తులు
ఖమ్మంవ్యవసాయం: బీడు, బంజర భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తున్నారు. భూముల్లో ప్లాంట్లు ఏర్పాటుచేయడం ద్వారా ఆదాయం పొందేలా రైతులను కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పీఎం కుసుమ్ పథకం కింద 500కిలోవాట్లు మొదలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశముండగా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీజీఈఆర్‌సీ) నిర్ణయించిన టారిఫ్‌తో డిస్కంలు కొనుగోలు చేస్తాయి. ఈ పథకం కోసం దరఖాస్తు గడువును 10వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యాన బుధవారం వరకు 139 దరఖాస్తులు అందాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 38, ఖమ్మం జిల్లా నుంచి 101దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందాయని రెడ్‌కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్‌కుమార్ తెలిపారు.
కమనీయం.. రామయ్య కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment