సాగు చేస్తూ.. దారి చూపిస్తూ! | - | Sakshi
Sakshi News home page

సాగు చేస్తూ.. దారి చూపిస్తూ!

Published Sat, Mar 8 2025 12:22 AM | Last Updated on Sat, Mar 8 2025 12:22 AM

సాగు చేస్తూ.. దారి చూపిస్తూ!

సాగు చేస్తూ.. దారి చూపిస్తూ!

● యూట్యూబర్‌గా రాణిస్తున్న మహిళా రైతు లక్ష్మీప్రసన్న ● 3.23 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో గుర్తింపు ● పంటలన్నీ సేంద్రియ విధానంలోనే..

బూర్గంపాడు: ఆమె తన భర్త సహకారంతో సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తోంది. సాగు సమయాన ఎదురయ్యే ఇక్కట్లు, పంటలను ఆశించే తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం సర్వసాధారణమే. అయితే, శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో తీసుకుంటున్న రక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండడంతో అవి తనకు మాత్రమే సొంతం కావొద్దని.. మరికొందరు రైతులకూ ఉపయోగపడాలనే భావనతో ఆ మహిళా రైతు అందరికీ అందుబాటులో ఉన్న యూట్యూబ్‌ను ఎంచుకుంది. సాగులో తాము అవలంబించే రక్షణ చర్యలు, జాగ్రత్తలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో రైతుల మన్ననలు అందుకుంటోంది. ఇప్పటి వరకు ఏడేళ్లలో 200 పైగా వీడియోలు అప్‌లోడ్‌ చేయగా.. ఆమె నిర్వహిస్తున్న చానల్‌కు 3.23 క్షల మంది సబ్‌స్క్రై బర్లు ఉండడం విశేషం.

మారుమూల గ్రామం నుంచి...

పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన పాపాల సాయి లక్ష్మీప్రసన్న ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆమెకు రాంబాబుతో వివాహమైంది. భర్తతో కలిసి తమకున్న పదెకరాల భూమిలో వివిధ రకాల పంటలను సేంద్రియ విధానంలో సాగుచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు పంటల సాగులో వస్తున్న మార్పులు, నూతన సాంకేతిక విధానాలు, నాణ్యమైన ఉత్పత్తులు, మార్కెటింగ్‌, భూసంరక్షణపై అవగాహన పెంచుకుంది. అయితే, ఈ అంశాలన్నీ అందరికీ చేరవేయాలనే లక్ష్యంతో ‘ఎస్‌ఆర్‌ విలేజ్‌ అగ్రికల్చర్‌ యూట్యూబ్‌ చానల్‌’ ప్రారంభించింది. ఆర్గానిక్‌ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ ఆర్యోగకరమైన ఉత్పత్తులు సాధించే క్రమాన ఆమెకు ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, భూసంరక్షణ, విత్తన శుద్ధి, విత్తనాల ఎంపిక, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, పంటలు ఆరబెట్టడం, మార్కెటింగ్‌ వసతులు తదితర అంశాలే కాక వ్యవసాయ అనుబంధ రంగాలైన నాటు కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమపైనా ఆమె అప్‌లోడ్‌ చేస్తున్న వీడియోలు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. సాయి లక్ష్మీప్రసన్న చక్కటి మాట తీరుతో వ్యవసాయ విధానాలను కళ్లకు కట్టినట్లుగా వీడియోలను తమ సెల్‌ఫోన్‌లోనే చిత్రీకరించి ఎలాంటి ఎడిటింగ్‌ లేకుండానే అప్‌లోడ్‌ చేస్తుండడం విశేషం. ఈ వీడియోలు చూసిన చాలా మంది రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పిన వాటికంటే బాగా అర్థమవుతున్నాయని చెబుతుండ డం ఆమె కృషికి దక్కిన నిదర్శనం. కాగా, యూ ట్యూబ్‌ ద్వారా వస్తున్న పారితోషికాన్ని పొలం పనులకు సహకరిస్తున్న కూలీలు, తోటి రైతుల అవసరాలకు అందిస్తుండడం మరో విశేషం.

ఆమె రాణిస్తోంది..

మరికొన్ని కథనాలు 9లో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement