
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కొత్తగూడెంఅర్బన్: అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటేల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులు పరిశీలించాలని, ఎల్–1,ఎల్–2,ఎల్ –3 జాబితా లు తయారు చేయాలని సూచించారు. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు రాని వారిని తిరిగి నమోదు చేయాలన్నారు. జాబితాలో తండ్రి పేరు ఉండి, పెళ్లయిన కుమారుడు దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఎంపీడీఓలు బాధ్యతగా వ్యవహరించి అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడాలని సూచించారు. భూముల క్రమబద్ధీకరణకు ఈనెల 31 వరకు కల్పి స్తున్న 25 శాతం రాయితీని అందరూ సద్వినియోగపరుచుకునే అవగాహన కల్పించాలని అన్నారు.
రుచికరమైన భోజనం అందించాలి..
పాల్వంచరూరల్ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సిబ్బందికి సూచించారు. పాత పాల్వంచ జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, స్పోర్ట్స్ కిట్లను పరిశీలించారు. భోజనం బాగుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భోజనంలో లోపాలుంటే ఉపాధ్యాయులు, నిర్వాహకులపై చర్య తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా కోఆర్డినేటర్ సైదులు, సతీష్‌కుమార్, ఎంఈఓ శ్రీరాంమూర్తి, హెచ్‌ఎం పద్మలత ఉన్నారు.
‘ప్రైవేట్’కు దీటుగా విద్యాబోధన..
సుజాతనగర్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యాబోధన అందుతోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక బీసీ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం వార్షికోత్సవం జరగగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యంతో చదివితేనే అనుకున్నది సాధిస్తారని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు, పాఠశాల ప్రిన్సిపాల్ వి.బ్యూలారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment