
అమ్ముదామా.. ఆగుదామా?!
మిర్చికి ఆశించిన ధర లేక సందిగ్ధంలో రైతులు
● నిల్వ చేయడానికే ఎక్కువ మంది మొగ్గు.. వ్యాపారులదీ అదే దారి ● విదేశీ ఆర్డర్లతో ధర పెరుగుతుందని ఆశలు ● నిండిపోతున్న కోల్డ్ స్టోరేజీలు
ఖమ్మంవ్యవసాయం: ఆశించిన ధర రాకపోవడంతో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసినా ఆశించిన దిగుబడి రాక.. వచ్చిన పంటకూ సరైన ధర దక్కక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ధర లేకపోవడంతో ఎక్కువ మంది నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ కోల్డ్ స్టోరేజీ వద్ద చూసినా మిర్చి బస్తాలతో వచ్చిన వాహనాలు బారులుదీరి కనిపిస్తున్నాయి.
ఏడాదిలో ఎంత తేడా..
గతేడాది సీజన్‌లో క్వింటా మిర్చికి రూ.20 వేల నుంచి రూ.23వేల వరకు ధర పలకగా.. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గత సంవత్సరం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి 2024 అక్టోబర్‌లో రూ.19 వేలు, నవంబర్‌లో రూ. 18వేల ధర పలకగా.. ఈ ఏడాదిసాగు చేసిన మిర్చికి రూ.17వేల వరకు ధర పలికింది. అయితే ఆ తర్వాత ధర పతనం అవుతుండగా తొలి కోతలు కావడంతో మైలకాయకు ధర తక్కువ ఉండడం సహజమమేనని భావించారు. కానీ రోజురోజుకూ ధర మరింత పతనం కాసాగింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికీ ధర పడిపోయింది. డిసెంబర్‌లో నిల్వ మిర్చి క్వింటా ధర రూ.16 వేలకు, కొత్త మిర్చి ధర రూ.15,500కు, జనవరిలో నిల్వమిర్చి ధర రూ. 14,500కు, కొత్త మిర్చి ధర రూ.15 వేలకు పడిపోయింది. ఇక ఫిబ్రవరిలో రెండో కోతగా నాణ్యమైన మిర్చి వచ్చినా ధరలో పురోగతి లేకవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. ఫిబ్రవరిలో గరిష్టంగా రూ.14వేలు, మోడల్ ధర రూ.13,500గా పలికింది.
కోల్డ్ స్టోరేజీల బాట..
మిర్చికి ప్రస్తుతం ఆశించిన ధర లేకపోగా.. మున్ముందు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో రైతులు నిల్వకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 2,17,360 మెట్రిక్ టన్నుల మిర్చి నిల్వచేసే సామర్థ్యం కలిగిన 48 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ధర ఆశాజనకంగా లేదని రైతులు పంట నిల్వ చేస్తుండగా, వ్యాపారులు భవిష్యత్‌పై అంచనాలతో నిల్వ పెడుతున్నారు. జిల్లాకు తోడు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల రైతులు కూడా ఖమ్మం బాట పడుతుండడంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీలన్నీ నిండిపోతున్నాయని తెలుస్తోంది.
అన్ సీజన్‌పై ఆశలు
ఈ ప్రాంతంలో పండించే ‘తేజా’ రకం మిర్చికి చైనా సహా పలు దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో అక్కడి ఆర్డర్ల ఆధారంగా ఎగుమతిదారులు కొనుగోలు చేయడంతో గత ఏడాది మంచి ధర పలికింది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేక ధరలో పురోగతి లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన అన్ సీజన్‌లో గతేడాది మాదిరిగా రూ.20 వేలు – రూ.23 వేల ధర వస్తుందనే ఆశతో అటు రైతులకు తోడు ఇటు వ్యాపారులు సైతం పంట నిల్వ చేస్తున్నారు.
పెట్టుబడులు కూడా రావని...
జనవరిలో 50 బస్తాల మిర్చి క్వింటాకు రూ.13,200 చొప్పున విక్రయించా. రెండో కోత పంటకు ధర పెరుగుతుందనుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు అమ్మితే పెట్టుబడి కూడా దక్కదని 42 బస్తాలు నిల్వ చేస్తున్నా.
– బానోత్ మట్టా, గోవింద్రాల, కామేపల్లి మండలం
జూన్ తర్వాత ఆలోచిస్తా...
ప్రస్తుత ధర పెట్టుబడులను పూడ్చే స్థితిలో లేదు. గత ఏడాది మిర్చి రూ. 20 వేలకు విక్రయిస్తే ఈసారి రూ.14 వేలే వచ్చింది. జూన్, జూలై తరువాత ధర పెరుగుతుందనే ఆశ ఉంది. అప్పటివరకు చూసి అమ్ముతా. – చిరసవాడ రాజు,
ఎదుళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం

అమ్ముదామా.. ఆగుదామా?!

అమ్ముదామా.. ఆగుదామా?!
Comments
Please login to add a commentAdd a comment