రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ ఉద్యోగ జేఏసీ కార్యదర్శి, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకటపుల్ల య్య, టీఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు డెక్క నర్సింహారావు, గగ్గూరి బాలకృష్ణ,తో పాటు పడిగ నరసింహారావు, సాదిక్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
30 నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
భద్రాచలం/దుమ్ముగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి, పర్ణశాల ఆలయాల్లో ఈ నెల 30 నుంచి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. 30వ తేదీ ఉగాది రోజున రక్షాబంధనం, ఉత్సవాంగ స్నపనం, మృత్సంగ్రహణం, 31 ఏప్రిల్ 1 తేదీల్లో తిరువీధి సేవలు, 2న గరుడ పట లేఖనం, సార్వభౌమ వాహన సేవ, 4న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీ పూజ, బలిహరణం, హనుమద్వాహన సేవ, 5 సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం జరగనున్నాయి. 6న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 7న మహాపట్టాభిషేకం, 8న సదస్యం, హంసవాహన సేవ, 9న తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వవాహన సేవ, 10న ఊంజల్ సేవ, సింహవాహన సేవ, 11న వసంతోత్సవం, ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి గజవాహన సేవ, 12న చక్రతీర్థం, పూర్ణాహుతి, శేషవాహన సేవ, ధ్వజావరోహణం, పుష్పయాగంలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. కాగా, పర్ణశాలలో ఈ నెల 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా కల్యాణ తలంబ్రాలు కలపడంతో పాటు పసుపు దంచే వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్ తెలిపారు.
పెద్దమ్మతల్లి ఆలయ
హుండీల లెక్కింపు
137 రోజులకు రూ.41.23 లక్షల ఆదాయం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సోమవారం దేవాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ పరిశీలకులు పి.భేల్‌సింగ్, ఈఓ ఎన్.రజనీకుమారి పర్యవేక్షణలో లెక్కించారు. 137 రోజులకు గాను రూ.41,23,907 లభించాయని, ఈ నగదుతో పాటు వివిధ విదేశీ కరెన్సీ, మిశ్రమ వెండి, బంగారం లభించాయని ఈఓ వివరించారు. కార్యక్రమంలో కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మధుసూదన్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ పోస్టుల భర్తీకి
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేటలోని ఏరియా ఆస్పత్రులు, పాల్వంచ సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ, మత్తు, రేడియాలజీ, నేత్ర వైద్య నిపుణులు, ఆసక్తి గల ఇతర నిష్ణాతులైన వైద్య నిపుణులను కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తామని వివరించారు. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, వైద్య నిపుణులకు రూ.2 లక్షలు, మత్తు, జనరల్ ఫిజీషియన్, పిల్లల వైద్య నిపుణులకు రూ.1.50 లక్షలు, ఇతర వైద్య నిపుణులకు రూ.లక్ష వేతనం ఇస్తామని పేర్కొన్నారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ
Comments
Please login to add a commentAdd a comment