ఆఖరులో ఆగమాగం!
● గడువు చివరలో నిధులు కేటాయింపు ● ఉపాధి హామీలో 974 పనులు మంజూరు ● సీసీ రోడ్లకు రూ.49.98 కోట్ల మేర నిధులు
చుంచుపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లను సీసీ రహదారులుగా మార్చడానికి ఉపాధి హామీ పథకంలో కేంద్రప్రభుత్వం జిల్లాకు భారీగా నిధులు కేటా యించింది. ఈ నిధులతో పల్లెల్లో సీసీరోడ్లు నిర్మిస్తుండగా ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారీగా పనులు మంజూరు చేస్తుండగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.49.98 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పనుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించారు.
974 సీసీ రోడ్లు మంజూరు..
2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 974 సీసీ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికోసం రూ.49.98 కోట్లు నిధులు కేటాయించింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 143 పనులకు రూ.11.60 కోట్లు, కొత్తగూడెంలో 165 పనులకు రూ.6.74 కోట్లు, ఇల్లెందులో 136 పనులకు రూ.7.54 కోట్లు, భద్రాచలంలో 193 పనులకు రూ.8.44 కోట్లు, పినపాక నియోజకవర్గంలో 316 పనులకు రూ.14.15 కోట్లు, వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలంలో 21 పనులకు రూ.1.11 కోట్ల చొప్పున కేటాయించారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా ఆ లోపే పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే నిధులు వెనక్కు వెళ్లిపోతాయి. దీంతో పలుచోట్ల అధికారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు. అయితే హడావిడిగా చేపడుతున్న సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ లోపిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. పలు చోట్ల సిమెంట్ తక్కువగా పోయడం, అక్కడక్కడా నాణ్యత లేని ఇసుక ఉపయోగిస్తుండడం, క్యూరింగ్ సక్రమంగా చేయకపోవడం వంటి లోపాలు కనిపిస్తున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం అనంతరం కనీసం 28 రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉండగా చాలాచోట్ల వరి గడ్డి వేసి వారం రోజుల పాటు నీటి తడితో ముగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో సీసీ రోడ్లకు రోజూ క్రమం తప్పకుండా క్యూరింగ్ చేయాలి. లేకపోతే రోడ్డు నాణ్యతపై ప్రభావం చూపుతుందని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ సారి ఈజీఎస్‌లో చేపడుతున్న సీసీ రోడ్ల బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు నెలల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరలో మంజూరవుతున్న పనులను ఆగమేఘాల మీద చేపట్టి పూర్తి చేస్తున్నా వీరికి సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు బయట నుంచి అప్పులు తెచ్చి మరీ సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తాం
జిల్లాలో 974 సీసీ రోడ్లు మంజూరయ్యాయి. ఆయా పనుల్లో జాప్యం చేయకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జిల్లాలో ఇప్పటికే చాలా వరకు పనులను మొదలుపెట్టాం. మిగిలిన పనులను సైతం రెండు, మూడు రోజుల్లో చేపట్టి గడువులోగా పూర్తి చేస్తాం. నాణ్యతలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షిస్తాం.
– ఎస్.శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ
ఆఖరులో ఆగమాగం!
Comments
Please login to add a commentAdd a comment