ప్రభుత్వ పథకాలు గిరిజనుల దరి చేరాలి
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనుల చెంతకు చేర్చేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించాలని సూచించారు. అర్హతల మేరకు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల రిపోర్టును తనకు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు.
కెరీర్ గైడెన్స్ అమలుపై అభినందనలు..
రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యా సంస్థల్లో పీఓ రాహుల్ ప్రారంభించిన కెరీర్‌గైడెన్స్ అమలు చేయడంపై అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా అధికారులు, సిబ్బందితో పీఓ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.
గిరిజన సంస్కృతి ప్రతిబింబించాలి..
గిరిజన మ్యూజియంలో చిత్రాలు, కళాకృతుల ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాలని పీఓ అన్నారు. గిరిజన మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన బీచ్ వాలీబాల్, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, బోటింగ్ కు ఏర్పాటు చేస్తున్న చెరువు పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గిరిజనుల ఆరాధ్య దైవాల చరిత్ర, దేవతల ప్రతిమలు, సమ్మక్క సారక్క గద్దెలు డిజైన్ చేయించి అమర్చాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఎస్‌డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఈఈ చంద్రశేఖర్, గురుకులం ఆర్‌సీఓ నాగార్జున రావు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఏపీఓ వేణు, వ్యవసాయ శాఖ ఏడీ భాస్కరన్, అధికారులు మనిధర్, ఉదయ్‌కుమార్, ప్రభాకర్‌రావు, గోపాల్‌రావు, నవ్య, ఆదినారాయణ, నారాయణరావు, జయరాజ్, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలి
భద్రాచలంటౌన్: డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలని పీఓ రాహుల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ (అటామస్) కళాశాల ప్రచార కరపత్రాలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల వివరాలతో పాటు సౌకర్యాలు, సాధించిన విజయాలు, కళాశాల ప్రాముఖ్యతను వివరించేలా కరపత్రాలను తీర్చిదిద్దారని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జాన్ మిల్టన్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment