నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
16న జిల్లా స్థాయి
అథ్లెటిక్స్ ఎంపికలు
కొత్తగూడెంటౌన్: దమ్మపేటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈనెల 16న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మహీదర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో జావెలిన్‌త్రో, 100, 400 మీటర్ల పరుగుపందెంలో బాలురు, బాలికలు, సీ్త్ర, పురుషులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులను ఈనెల 23న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, వివరాలకు కోచ్ జె.కృష్ణ(70135 52707)ను సంప్రదించాలని సూచించారు.
స్పోర్ట్స్ స్కూళ్లలో
ప్రవేశానికి దరఖాస్తులు
భద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలోని బాలురు, కాచనపల్లిలోని బాలికల స్పోర్ట్స్ స్కూళ్లతో పాటు హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ఐదో తరగతికి ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్ స్థాయిలో ఈనెల 16 నుంచి 18వరకు, జిల్లాస్థాయిలో 26 నుంచి 28వ తేదీ వరకు పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 9 – 11 ఏళ్ల వయస్సు కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అర్హులని వెల్లడించారు. భద్రాద్రి జిల్లా విద్యార్థులు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్‌లో, ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉసిరికాయలపల్లిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగే డివిజన్ స్థాయి పోటీలకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అపై జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తుది ఎంపిక పోటీలు నిర్వహించి ప్రవేశాలకు అర్హులను ఎంపిక చేస్తామని పీఓ తెలిపారు.
సింగరేణిలో లైజన్
ఆఫీసర్ల నియామకం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా విస్తరించి ఉన్న 11 ఏరియాలకు 11 మంది లైజన్ ఆఫీసర్లను యాజమాన్యం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ ఏరియాకు వి.మురళి, కొత్తగూడెం ఏరియాకు ఆవధూత శ్రీధర్, ఇల్లెందుకు జి.నాగశేషు, మణుగూరుకు పి, వీరభద్రరావు, ఆర్జీ–1కు పి.శ్రీనివాస్, ఆర్జీ–2కు పి.వేణుగోపాల్. ఆర్జీ –3కి చంద్రశేఖర్, భూపాలపల్లి ఏరియాకు పి.బాలరాజు, బెల్లంపల్లికి ఎం,మధుకుమార్, మందమర్రికి ఎండీ ముస్తఫా, శ్రీరాంపూర్ ఏరియాకు ఎన్. సత్యనారాయణను నియమిస్తున్నట్లు ప్రకటించింది.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
Comments
Please login to add a commentAdd a comment