యూడీఐడీ కార్డుల జారీపై అపోహలు వద్దు
చుంచుపల్లి: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డుల జారీపై ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఐడీఓసీలో దివ్యాంగులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు ఇకపై సదరం సర్టిఫికెట్ల జారీ విధానం ఉండదని, అందుకే యూడీఐడీ కార్డులు జారీ చేయనున్నామని తెలిపారు. వైద్యులు ధ్రువీకరించిన వైకల్య శాతం సర్టిఫికెట్‌తో పాటు దివ్యాంగుల పూర్తి వివరాలను యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేస్తే ఐడీ కార్డులు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా వారి చిరునామాకు చేరుతాయని వెల్లడించారు. ఈ కార్డుల కోసం మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో సదరం ద్వారా 8 రకాల వైకల్యాలకు మాత్రమే ఉండేదని, ఇప్పుడు యూనిక్ కార్డులను 21 రకాల వైకల్యాలు గల వారికి మంజూరు చేస్తున్నామని తెలిపారు. యూడీఐడీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఐదు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దరఖాస్తుదారులు పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, జెండర్, ఫొటో, సంతకం, ఆధార్ కార్డు నంబర్, అడ్రస్ తదితర సమాచారాలను నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మీసేవా కేంద్రాలకు వచ్చే దివ్యాంగులకు ఉత్తమ సర్వీస్ అందించాలని నిర్వాహకులకు సూచించారు. వారి నుంచి అధిక రుసుము వసూలు చేసినా, సేవల్లో నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మీసేవా కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లెనినా, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ఎల్‌ఆర్‌ఎస్ అవకాశాన్ని వినియోగించుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం) : మార్చి 31 నాటికి భూ క్రమబద్ధీకరణ చేసుకునేలా ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2020 తర్వాత లేఔట్ చేసిన వెంచర్లలో ప్లాట్లు తీసుకున్న 5,488 మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అందులో 400 మంది మాత్రమే డబ్బు చెల్లించారని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ద్వారా ఇప్పటికే నోటీసులు జారీ చేసినా ఫోన్ నంబర్లు, చిరునామాల్లో తేడాలు ఉండడంతో కొందరికి చేరడం లేదన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 2,112 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ అవకాశాన్ని వినియోగించుకోకుంటే ఆయా ప్లాట్లలో ఇల్లు నిర్మించుకోవాలంటే అప్పటి ప్లాట్ విలువపై ప్రో రేటా ఫీజుతో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. భవిష్యత్‌లో ప్లాట్ అమ్ముకోవాలన్నా ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే విలువ పెరుగుతుందని చెప్పారు. సమావేశంలో సబ్ రిజిస్ట్రార్ వేణుమాధవ్, కొత్తగూడెం, పాల్వంచ టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment