ఈత.. కావొద్దు గుండెకోత..
చుంచుపల్లి: జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. ప్రస్తుతం మార్చిలోనే పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చిన్నారులు, యువకులు, పెద్దలు ఈత కొట్టేందుకు వ్యవసాయ బావులు, చెరువులు, కాల్వలు, కుంటలను ఆశ్రయిస్తుంటారు. నీటిలోతు తెలియక మునిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. రాబోయేది నిండు వేసవి కాలం. విద్యార్థులకు ఒక్కపూట బడులు మొదలు కాగా మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువకులు ఈతకు వెళ్లే సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
అత్యధిక ఉష్ణోగ్రతలు
వేసవి ఆరంభంలోనే జిల్లావ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండు వేసవిలో చిన్నారులు, యువకులు చెరువులు, కుంటలు, కాల్వల్లో ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఈత మంచి వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమే కానీ.. ఈత నేర్చుకోకుండా నీటిలోకి దిగడం చాలా ప్రమాదకరం. చిన్నారులు, యువకులందరికీ ఈత రాకపోవడం, ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరికలు లేకపోవడంతో స్నేహితులతో కలిసి నీటి వనరుల వద్దకు వెళ్లే పిల్లలు, యువకులు ప్రమాదాలను అంచనా వేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదాలకు నిలయమైన చెరువులు, వాగులు, కుంటలు, కాల్వల వద్ద నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఆచరణకు నోచుకోలేదు. ఈ మేరకు ఈత విషయంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తగిన అవగాహన కల్పించాల్సి ఉంది. అలాగే, కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. నీటి కుంటలు, వాగులు, పంట కాల్వలు, చెరువులు, వ్యవసాయ బావులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే పొంచి ఉన్న ప్రమాదాల గురించి చిన్నారులను హెచ్చరించాలి. నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే ఈత నేర్పించాలి. నీట మునిగేవారిని కాపాడే ప్రయత్నంలోనూ కొందరు ఈత వచ్చినవారూ ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్నిమాపక, పోలీస్ శాఖ, గజ ఈతగాళ్ల సహకారంతో, రక్షించే మెళకువలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
నిఘా అవసరం
● ప్రస్తుతం పాఠశాలలు ఒకటే పూట కొనసాగుతుండగా, త్వరలో వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు ఎటు వెళ్తున్నారనే అంశంపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి.
● ఈత రానికారణంగా గట్టుమీద ఉండేవారు సైతం కాసేపటికి నీటిలో దిగుతుంటారు. ఇదే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈత నేర్పించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
● ఈత విషయంలో పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉంది.
● ఈత నేర్చుకునే సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి.
● బావులు, కాల్వలు, చెరువుల్లో ఈత కొట్టే ముందు వాటి లోతును ముందుగానే పరిశీలించాలి. తక్కువ నీరు ఉన్న ప్రదేశంలోకే వెళ్లాలి.
● ఈత కొట్టే సమయంలో సరదాలు, పందేలు, అత్యుత్సాహం వంటివి వద్దు. అవి ప్రాణాలకే ముప్పు తెస్తాయి.
● పూర్తిగా ఈత వచ్చే వరకు లోతైన ప్రాంతానికి వెళ్లొద్దు. ఈత నేర్చుకునే సమయంలో ట్యూబులు, బెండ్లు వాడుతున్నప్పటికీ శిక్షకులు లేకుండా జలవనరుల్లోకి దిగడం మంచిది కాదు.
సరదా కోసం వెళ్తే ప్రాణాలు హరీ
కాపాడే ప్రయత్నంలోనూ మరణాలు
ప్రతి వేసవి సీజన్‌లోనూ ఘటనలు
పిల్లలపై తప్పనిసరి తల్లిదండ్రుల నిఘా
గతంలో జరిగిన కొన్ని ఘటనలు..
2023 ఏప్రిల్ 13న అశ్వారావుపేట ఉసిర్లగూడేనికి చెందిన కొర్సా ఏసుబాబు (17) స్థానిక ఊర చెరువులో స్నేహితులతో కలిసి ఈతకు దిగి లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు.
2023 ఫిబ్రవరి 28న భద్రాచలానికి చెందిన ఆరుగురు స్నేహితులు మేడువాయి వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లారు. అందులో అక్బర్‌బాషా (17), పాలపర్తి వాసు (16) లోతు గమనించక గల్లంతై చనిపోయారు.
పాల్వంచ బొల్లోరిగూడెం ఏరియాకు చెందిన సిద్దెల రీక్షిత్‌కుమార్ (11) 2022 మార్చి 14న స్నేహితులతో కలిసి కిన్నెరసాని నుంచి కేటీపీఎస్‌కు వెళ్లే నీటి కాల్వలో ఈతకు వెళ్లి నీళ్లలో మునిగి కొట్టుకుపోయి మృతి చెందాడు.
కొత్తగూడెం సంజయ్‌నగర్ కాలనీకి చెందిన ఎస్‌డీ సోహెల్‌పాషా (17), అబ్దుల్ హమీద్, జక్కినిబోయిన అనిల్‌కుమార్ (15) 2022 జూన్ 27న పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి కేటీపీఎస్ వెళ్లే కాల్వలో ఈతకు వెళ్లి లోతు ఉండటంతో మునిగి చనిపోయారు.
గతేడాది జనవరి 20న టేకులపల్లి మండలం సీతారాంపురానికి చెందిన బోడ అజయ్ (20) కొత్తగూడెంలో చదువుతూ స్నేహితులతో కలిసి పాల్వంచ కరగకవాగుకు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment