ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
చుంచుపల్లి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ముత్యాల తలంబ్రాలను ఆర్టీసీ ద్వారా నేరుగా ఇంటికే పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ తెలిపారు. మంగళవారం కొత్తగూడెం డిపోలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. నవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తులు ఆర్టీసీ కార్గో విభాగం ద్వారా రూ.151 చెల్లించి తలంబ్రాలను పొందవచ్చన్నారు. ఇందు కోసం ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం–91542 98599, పాల్వంచ–93473 40036, ఇల్లెందు– 83280 18525, గుండాల–95021 42298, ఆళ్లపల్లి–84650 70239 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సిబ్బంది సునీత, జహీరుద్దీన్, రాములు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హనుమ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
టేకులపల్లి: బీసీ గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8, 9 (ఇంగ్లిష్ మీడియం) తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, తుది గడువు ఈనెల 31 వరకు ఉందని టేకులపల్లి ఎంజేపీ బాలుర గురుకుల ప్రిన్సిపాల్ ఎస్.రవీందర్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 20 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు బోనఫైడ్, ఆధార్‌కార్డు, ఫొటోపై సంతకం, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ పత్రం కలిగి ఉండాలని తెలిపారు.
తండ్రికి కుమార్తె తలకొరివి..
కొత్తగూడెంటౌన్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తాటిపల్లి రాజేశ్‌కుమార్‌కు పెద్ద కూతురు అంతక్రియలను నిర్వహించడం అందరినీ కలచివేసింది. కొత్తగూడెం న్యూగొల్లగూడెం రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉంటున్న ‘సాక్షి’ఉద్యోగి తాటిపల్లి రాజేశ్‌కుమార్ ఈనెల 14న కారు ఢీకొని మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం మృతుడి పెద్ద కూతురు శ్రీకరి తలకొరివి పెట్టింది. తండ్రికి ఏమైందో తెలియని వయస్సులో అంతక్రియలు నిర్వహించడంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు.
ఇసుక ట్రాక్టర్లు సీజ్
దుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక, నర్సాపురం గ్రామాల్లోని గోదావరి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ అశోక్ మంగళవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. తూరుబాక, నర్సాపురం గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య.. దాడి చేసి ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో తూరుబాకకు చెందిన చిట్టిమల్ల వెంకటేశ్, పాత మారేడుబాక వాసి జాబిశెట్టి రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
మహ్మద్‌నగర్‌లో..
చండ్రుగొండ: మండలంలోని మహ్మద్‌నగర్ గ్రామశివారులోని పెద్దవాగు నుంచి మంగళవారం రాత్రి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్‌ఐ పాపయ్య తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పెద్దవాగు నుంచి ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఎస్కే యాకూబ్‌ను అదుపులో తీసుకున్నామని ఏఎస్‌ఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
కల్లూరు: కల్లూరులోని తిరువూరు క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరువూరు క్రాస్ మీదుగా వెళ్తున్న కంటైనర్ కల్లూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా వెనక కూర్చున్న ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన దుబ్బాక రాజారావు(50) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే బైక్ నడుపుతున్న వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు మృతుడి బంధువు ప్రసాద్ ఫిర్యాదుతోకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
Comments
Please login to add a commentAdd a comment