ఆలయంలో రెండోసారి చోరీ
అశ్వారావుపేటరూరల్: మండలంలోని పాత మామిళ్లవారిగూడెం గ్రామ శివారులో ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం గేటు తాళాన్ని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు లోపల ఉన్న హుండీని తెరిచి నగదు అపహరించారు. హుండీలో సుమారు రూ.10 వేలు ఉంటాయని భక్తులు చెప్పారు. కాగా, ఇదే ఆలయంలో గత జనవరి 9న హుండీ పగులగొట్టి రూ. 40 వేలు చోరీ చేశారు. ఆలయంలో రెండోసారి చోరీ జరిగిన నేపథ్యంలో పోలీసులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. చోరీపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై యయాతి రాజు తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
అశ్వారావుపేటరూరల్: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని బుధవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై టీ యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపురం నుంచి బోలెరో వాహనంలో పది బస్తాల్లో ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైపు తరలిస్తుండగా అశ్వారావుపేట బస్టాండ్ సెంటర్‌లో పోలీసులు పట్టుకున్నారు. వాహనం డ్రైవర్ దారం చిన్న శ్రీనివాస్, వాహన యజమాని ఆదివిష్ణుపై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులకు అప్పగించి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
బూర్గంపాడు: మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతున్న వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్‌ఐ రాజేష్ ఘటనా ప్రాంతానికి చేరుకుని ట్రాక్టర్ సాయంతో చెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో మృతుడు ఎవరనేది గుర్తించలేకపోయారు. మృతుడి వివరాలు తెలిస్తే సమాచారమందించాలని ఎస్‌ఐ రాజేష్ కోరారు.
పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్య
దమ్మపేట: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న యువకుడు బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... దమ్మపేట గ్రామానికి చెందిన అయినవెల్లి నాని(28) కొంతకాలంగా వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో భార్య సునీత, కుటుంబ సభ్యులు మంగళవారం మందలించారు. దీంతో మనస్తాపం చెంది అదేరోజు రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి మూడేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
నాటుసారా స్వాధీనం
పాల్వంచరూరల్: మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో బుధవారం ఎకై ్సజ్ అధికారులు నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పి విక్రయదారులను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ ప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.
మర్కోడు రేషన్ షాపు సీజ్
గుండాల: కొంతకాలంగా రేషన్‌షాపు డీలర్ విధులు హాజరు కాకుండా సరుకులు ఇవ్వకపోవడంతో ఇల్లెందు సివిల్ సప్లయీస్ అధికారులు బుధవారం దుకాణాన్ని సీజ్ చేశారు. ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీ కేంద్రంలోని రేషన్ షాపు సేల్స్‌మెన్ తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నాడని, బియ్యం ఇవ్వడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో సివిల్ సప్లయీస్ డీటీ యాకూబ్‌పాషా తదితరులు తనిఖీ చేశారు. బుధవారం గ్రామస్తుల సమక్షంలో తాళాలు పగులగొట్టి వీడియో తీస్తూ స్టాక్‌ను పరిశీలించారు. రికార్డులు పరిశీలించి 41 క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పలుమార్లు విచారణ కోసం ప్రయత్నించినా సేల్స్‌మన్ నుంచి స్పందన లేకపోవడంతో షాపును సీజ్ చేశారు. రేషన్ షాపు నిర్వహణ బాధ్యతలను మరో సేల్స్‌మెన్‌కు అప్పగించాలని జీసీసీ అధికారులను కోరామని, నివేదిక అందించామని డీటీ వివరించారు.
ఆలయంలో రెండోసారి చోరీ
Comments
Please login to add a commentAdd a comment