వారికి ‘ఆధారం’ లేదు
కేంద్ర ప్రభుత్వం జారీ చేసే అత్యున్నత గుర్తింపు కార్డుల్లో ఒకటైన ఆధార్ లేక గిరిజన దంపతులు మూడేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్యాలయం మొదలు కలెక్టరేట్ వరకు చెప్పులరిగేలా తిరుగుతున్నా వారి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
●హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలి
రాష్ట్ర అక్షరాస్యత 75 శాతంగా ఉంటే జిల్లా సగటు 73 శాతంగా ఉంది. జిల్లాలో 43 శాతం అడవులే ఉన్నాయి. గిరిజన జనాభానే ఎక్కువ. గ్రామస్థాయిలో పరిష్కారం కాని సమస్య కోసం ఐడీఓసీలో నిర్వహించే గ్రీవెన్స్‌కు వస్తున్నారు. అయితే దరఖాస్తులు ఎలా రాయాలో తెలియక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న సమస్యలకే మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో గ్రీవెన్స్‌సెల్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
●ఆర్థికంగా అండ కావాలి
కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన జిమ్మిడి శ్రీనుకు ప్రస్తుతం 47 ఏళ్లు. ఇరవై ఏళ్ల క్రితం వరకు జీవితం సాఫీగానే సాగింది. ఆయనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు కనుబొమ్మ దగ్గర నొప్పి రాగా, ఓ ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించింది. నాటి నుంచి కన్ను, కాలు, చేయి పని చేయకుండాపోయాయి. అప్పటి వరకు అరెకరం సొంత పొలానికి తోడు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయగా.. అతడి జీవితానికి బ్రేకులు పడ్డాయి. అయినా నమ్మకం కోల్పోకుండా ఇంటి వద్దే కిరాణా షాపు పెట్టుకుంటే నష్టాలు రావడంతో అది మూతబడింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. ప్రస్తుతం తాటిగూడెం వరకు నాణ్యమైన రోడ్డు నిర్మిస్తుండగా.. ఆ పని పూర్తయి రోడ్డు బాగుంటే కిరాణా షాపు మళ్లీ పుంజుకుంటుందని, తద్వారా తన కాళ్లపై తాను నిలబడే అవకాశం వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. అయితే షాపు ఏర్పాటుకు అవసరమైన రుణం ఇప్పించాలని గ్రీవెన్స్‌కు వచ్చి అధికారులను వేడుకున్నాడు.
●ఆగిన సంక్షేమం
పాల్వంచ మండలం పాండురంగాపురంలో వాంకుడోతు మోంగ్య, భద్రి దంపతులు జీవిస్తున్నారు. ఇద్దరిదీ ఇదే గ్రామం. ఇక్కడే పెళ్లి చేసుకుని, ఇన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఓటరు గుర్తింపు కార్డులో మోంగ్య 1951లో పుట్టినట్టుగా వివరాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఈ కుటుంబ సభ్యులకు ఆధార్‌కార్డులు కూడా వచ్చాయి. దీంతో పాటు ప్రభుత్వం అందించే ఉపాధిహామీ పథకం, ఆసరా పింఛన్లు, రేషన్ బియ్యం వంటి సంక్షేమ పథకాలూ అందాయి. కానీ మూడేళ్ల క్రితం మోంగ్య, భద్రిల ఆధార్‌లో సమస్యలు వచ్చాయి. బయోమెట్రిక్ హాజరు నమోదైన తర్వాత వీరి వేలి ముద్రలు ఆధార్‌తో మ్యాచ్ కావడం లేదు. దీంతో గత మూడేళ్లుగా ఉపాధి హామీ, పింఛన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. వయసు పైబడి, ఒంట్లో శక్తి సన్నగిల్లుతున్న తరుణంలో ఈ సమస్య రావడంతో ఇబ్బంది పడుతూనే ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒకటికి రెండు సార్లు ఓటర్ ఐడీలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న జిరాక్స్ కాపీలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నిరక్షరాస్యులైన ఈ దంపతులకు ఎదురైన సాంకేతిక సమస్యకు జిల్లా ఉన్నతాధికారులే పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది.
ఆధార్ కార్డుల్లేక రెండేళ్లుగా ఇబ్బందులు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
గ్రీవెన్స్‌లో అయినా
పరిష్కారం దొరుతుందనే ఆశ..
వారికి ‘ఆధారం’ లేదు
వారికి ‘ఆధారం’ లేదు