ఈ దుర్ఘటనకు బాధ్యులెవరు?
● ఐదంతస్తుల భవనం కూలి రెండు కుటుంబాలు ఆగం ● బలహీన పునాదిపై బహుళ అంతస్తుల భవన నిర్మాణం ● కార్మికులకు శాపంగా మారిన అధికారుల అలసత్వం!
భద్రాచలం: పొట్టకూటి కోసం భవన నిర్మాణ పనులకు వెళ్లిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలు ఆగమయ్యాయి. భవనం కూలి ఓ కార్మికుడు మృతి చెందగా, శిథిలాల కింద మరో కార్మికుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో ఈ దుర్ఘటనకు బాధ్యులెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బలహీనమైన పునాదిపై అధికారులు, స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పెడచెవిన పెట్టిన ఇంటి యజమానిదా..? కళ్ల ముందే పేకమేడలా గిరిజన చట్టాలు, నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానురీతిగా నిర్మాణం చేస్తున్నా నోటీసులతో సరిపెట్టిన అధికారులదా? సత్వరమే చర్యలు తీసుకోలేని ఉన్నతాఽధికారులదా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి. వీరందరీ అలసత్వం, నిర్లక్ష్యం వల్లే రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయని పలువురు పేర్కొంటున్నారు.
ఉన్నతాధికారుల అలసత్వానికి..
బహుళ అంతస్తుల భవనం బుధవారం కుప్పకూలిన సంఘటనలో యజమాని నిర్లక్ష్యంతోపాటు అందరి అలసత్వమూ కనిపిస్తోంది. గతేడాది జూలైలోనే నిబంధనలకు విరుద్ధంగా ఐదో అంతస్తు నిర్మాణం జరుగుతుండటంతో స్థానిక ఆదివాసీ నాయకులు అడ్డుకున్నారు. గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారికి ఫిర్యాదు చేయటంతో... ఆయన ఆ అంతస్తు శ్లాబు సమయంలో పనులు నిలిపివేయించారు. ఆ తర్వాత గ్రామపంచాయతీ అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టిన ఆ ఇంటి యజమాని ఆ అంతస్తు శ్లాబును పూర్తి చేశాడు. ఈ క్రమంలో గిరిజన సంఘ నాయకులు ఐటీడీఏ పీఓ, కలెక్టర్, డీఎల్‌పీఓ, మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదులు అందించారు. దీంతో గ్రామపంచాయతీ అధికారులు గతేడాది జూలై నుంచి సదరు ఇంటి యజమానికి నోటీసులను అందజేస్తున్నారు. మూడు అంతస్తులను కూలగొట్టాలని, లేని పక్షంలో వాటిని కూలగొట్టి సదరు ఖర్చును రికవరీ చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే నోటీసుల వరకు మాత్రమే పరిమితం కావడంతో సదరు ఇంటి యజమాని గత 15 రోజుల నుంచి పనిని తిరిగి ప్రారంభించాడు. అలా కాకుండా జిల్లా ఉన్నతాధికారులే చొరవ తీసుకుని వివాదాస్పదంగా ఉన్న భవన నిర్మాణాన్ని పరిశీలించి, కూలగొడితే.. ఇప్పుడు రెండు కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేవి. ప్రభుత్వం సైతం బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోవడంపై రాజకీయ పార్టీలు, వివిధ కుల, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అభివృద్ధి గిరిజన చట్టాలకు లోబడే ఉండాలి..
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న భద్రాచలంలో గిరిజన, గిరిజనేతర జనాభా క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీలో 1/70 యాక్ట్ పరిధిలో ఉండటంతో ఆ చట్టాలకు అనుగుణంగానే అభివృద్ధి సాగుతోంది. అయితే గిరిజన, గిరిజనేతరులకు నివాస సౌలభ్యం కోసం ఇంటి నిర్మాణాలకు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయనప్పటికీ ఇటీవల కాలంలో భద్రాచలంలో ఇంటి నిర్మాణాల పేరిట లాడ్జీలను పెద్ద ఎత్తున నిర్మించడం ఆందోళనకు గురిచేస్తోంది. జీప్లస్ టూ కు మాత్రమే అనుమతులున్నా, పట్టాలు కలిగిన భూములకు నిబంధనల సడలింపు ఉంది. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతూ జరిగే నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు. గిరిజన చట్టాలకు లోబడే గిరిజన, గిరిజనేతరులకు లాభం చేకూరేలా, భద్రాచలం పట్టణ అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
గిరిజన చట్టాలకు విఘాతం లేకుండా..
ఏజెన్సీ చట్టాలకు లోబడి అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించాలి. గిరిజన, గిరిజనేతరులకు లాభం చేకూరేలా, గిరిజన చట్టాలకు విఘాతం కలుగకుండా చూడాలి. అఽధికారుల అలసత్వానికి, నిర్లక్ష్యానికి అమాయకుల ప్రాణాలు కోల్పోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
– పూనెం ప్రదీప్‌కుమార్,
మావన హక్కుల సంఘం నాయకుడు
ఈ దుర్ఘటనకు బాధ్యులెవరు?
ఈ దుర్ఘటనకు బాధ్యులెవరు?