
పోక్సో కేసు నమోదు
ఇల్లెందు: స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పట్టణానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడి చేశాడని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగుల్‌మీరాఖాన్‌పఠాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరిపై కేసు
జూలూరుపాడు: మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ నడుపుతున్న నిర్వాహకుడిని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. జూలూరుపాడులోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద గుండెపుడి గ్రామానికి చెందిన బోడా శ్రీను చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. వెంగన్నపాలేనికి చెందిన తంబర్ల నరసింహారావు, జూలూరుపాడుకు చెందిన కంచెపోగు నరసింహారావు చికెన్ సెంటర్‌లోకి ప్రవేశించి విలేకరులమని చెప్పి సెల్‌ఫోన్‌తో వీడియోలు తీస్తూ, తమకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే చనిపోయిన కోళ్లు, రోగాలతో ఉన్న కోళ్లను అమ్ముతున్నట్లు పేపర్లలో రాయడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి పేర్కొన్నారు.
తహసీల్‌లో పాము
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓ పాము కలకలం రేపింది. ఎలుకను వేటాడుతూ వచ్చిన పామును గుర్తించిన ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన స్నేక్ రెస్క్యూ సంతోష్‌కు సమాచారం ఇవ్వగా ఆయన చేరుకుని పామును బంధించారు. ఆ తర్వాత పామును అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఆయన తెలిపారు.