
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బూర్గంపాడు: సారపాక గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సారపాక కండక్టర్స్ కాలనీకి చెందిన బ్రహ్మాచారి(60) వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అశ్వాపురం మండలం ఎలుకలగూడెం మోటార్‌సైకిల్‌పై వెళ్లి మంగళవారం రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు అతని కోసం పలుచోట్ల వెతికారు. బుధవారం ఉదయం సారపాక గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయని, మృతుని కుమారుడు అశోక్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ రాజేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు, బైక్ ఢీ: దంపతులకు తీవ్రగాయాలు
జూలూరుపాడు: బైక్, కారు ఢీకొని దంపతులు గాయపడ్డ సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొమ్ముగూడెం వద్ద ఖమ్మం వైపు నుంచి కొత్తగూడెం వెళుతున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కరివారిగూడెం కాలనీకి చెందిన గుగులోత్ కోటియా, లక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీకి ఢీకొని ఆగిపోయింది. ప్రహరీ కూడా ధ్వంసమైంది. గాయపడ్డ దంపతులు కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోటియా, లక్ష్మి దంపతులు కొత్తగూడెం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి