
మూడింటికీ ఒక్కరే !
● పాల్వంచ మున్సిపల్ కమిషనరే కొత్తగూడెం, అశ్వారావుపేటకు ఇన్‌చార్జ్ ● కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ● ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కిందిస్థాయి సిబ్బంది
కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో ఎ’ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడేనికి, ఇటీవలే అప్‌గ్రేడ్ అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి పర్మనెంట్ కమిషనర్లు లేరు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత ప్రస్తుతం ఆ రెండు పట్టణాలకూ ఇన్‌చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. దీంతో ఆమె ఎక్కడా పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. అనేక పనులు పెండింగ్ పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్‌స్వామి గత నెలలో తన మాతృ సంస్థకు బదిలీ అయ్యారు. దీంతో పాల్వంచ కమిషనర్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వారావుపేట ఇటీవలే మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కాగా, అక్కడా సుజాతే ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించడం ఆమెకూ కష్టంగానే మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆమె ఎప్పుడు వస్తారు.. ఎప్పుడు వెళ్తారనే విషయాలపై కింది స్థాయి అధికారులకు స్పష్టత లేక సమన్వయం కొరవడుతోంది. దీంతో కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ అవసరాల కోసం వస్తున్న ప్రజలు సిబ్బంది లేక వెనుదిరగాల్సి వస్తోంది. ఇదిలాగే కొనసాగితే మున్సిపాలిటీ పాలన గాడి తప్పే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పనుల్లో జాప్యంతో ఇక్కట్లు..
కొత్తగూడెం మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగాన్ని పరిశీలిస్తే మ్యుటేషన్ ఫైళ్లు కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇళ్లు కొనుగొలు చేసిన వారు తమ పేర్లపై మారకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఇంటి నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నెలల తరబడి మున్సిపాలిటీ చుట్టూ తిరుగాల్సి వస్తోంది. కమిషనర్ లేకపోవడంతో సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని, వచ్చిన వారు సైతం అంతంతగానే పనులు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నెల వరకు ఇంటి పన్నుల వసూళ్లు 80 శాతం దాటలేదంటే సిబ్బంది నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఇష్టానుసారంగా టెండర్లు..
కొత్తగూడెం మున్సిపాలిటీలో డీఎంఎఫ్ నిధులతో వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఎంపవర్‌మెంట్ సెంటర్ల నిర్మాణం కోసం రెండు నెలల క్రితం ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. దీంతో కొత్తగూడెం, పాల్వంచ నుంచి దాదాపు 40 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. అయితే గత శనివారం సెలవు రోజు అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కిన కొందరు సిబ్బంది.. తమకు అనుకూలమైన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో టెండర్లు ఓపెన్ చేశారు. పని దినాల్లోనే టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉండగా రహస్యంగా సెలవు రోజు ఓపెన్ చేయడంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇలాంటి ఘటనలు కొత్తగూడెం మున్సిపాలిటీలో అనేకం జరుగుతున్నాయి. జిల్లాలో ఏ గ్రేడ్ మున్సిపాలిటీకి శాశ్వత కమిషనర్‌ను నియమించాల్సిన అవసరం ఉందని పట్ణణ వాసులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ సుజాతను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.