
వాగు.. బాగుపడేనా..?
● మొదలుకాని బుగ్గవాగు సుందరీకరణ పనులు ● గత జనవరిలో జరిగిన శంకుస్థాపన ● రూ.9 కోట్లతో టెండర్ పూర్తి ● కాగితాలకే పరిమితమైన ఒప్పందం
ఇల్లెందు: ఇల్లెందు మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం జరిగినా పనులు మొదలు పెట్టడం లేదు. ఈ ఏడాది జనవరి 22న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. టీయూఎఫ్‌ఐడీసీ, డీఎంఎఫ్ నిధులు రూ.9 కోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నిధులతో బుగ్గవాగు సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే బుగ్గవాగు పూడిక తీయకపోతే నీరు ఇళ్లల్లోకి వస్తోంది. దీంతో బుగ్గవాగు ప్రక్షాళన కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో వాగు వెంట ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్లు రిటైన్ వాల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇరు వైపులా వాకింగ్ ట్రాక్‌లు వాగులో చెత్తా చెదారం వేయకుండా ఫెన్సింగ్ నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన జరిగిన జనవరిలో పనులు మొదలై ఉంటే వచ్చే వర్షాకాలం నాటికి అంటే జూన్ – జూలై వరకు పూర్తయ్యే అవకాశం ఉండేది. కానీ, సుందరీకరణ మొదుల కాకపోవటంతో వచ్చే వర్షాకాలాన్ని తలచుకుని పట్టణ ప్రజలు.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం..
పట్టణం మధ్య నుంచి ప్రవహించే బుగ్గవాగు ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. ఎంతో మంది వాగులోకి వచ్చి నిర్మాణాలు చేసుకున్నారు. ఇళ్లు, దుకాణాల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను వాగులో వదిలేస్తుండటంతో పూడిక పేరుకుపోతోంది. అధిక వర్షాలకు వాగు పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచుతోంది. బుగ్గవాగు మీద రెండు చోట్ల లోలెవల్ కాజ్‌వేలు ఉన్నాయి. వాగు పొంగితే కాజ్‌వేల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. చెత్తాచెదారం కాజ్‌వే ఖానాలకు అడ్డుపడి నీరు పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఒకవైపు బుగ్గవాగు, అలుగు వాగుల వల్ల అటు సత్యనారాయణపురం, ఇటు ఇల్లెందులపాడు ప్రజలకు వరదపోటు తప్పటం లేదు. కాగా, పట్టణం మధ్య నుంచి అంటే హిందూ శ్మశాన వాటిక నుంచి స్టేషన్ బస్తీ చివరి వరకు కిలోమీటర్ దూరం ఈ వాగు ప్రవహిస్తోంది. నంబర్–2 బస్తీ, ఎల్‌బీఎస్‌నగర్, స్టేషన్‌బస్తీలకు ముప్పు ఉంటుంది. సత్యనారాయణపురం 1, 2వ వార్డులకు అలుగు వాగు ఆటంకంగా మారింది. ఈ వాగు మీద బ్రిడ్జి నిర్మాణం ఊసే లేదు. ఏటా వాగు ఉప్పొంగటం వాగు దాటకుండా ఎటు ప్రజలు అటే నిలిచిపోవటం సర్వసాధారణంగా మారింది. గత వర్షాకాలంలో ఓ వ్యక్తి వాగు దాటుతూ బైక్‌తో సహా కొట్టుకుపోయి కొంత దూరంలో ఒడ్డుకు చేరాడు. సత్యానారాయణపురం వాసులకు పట్టణం నుంచి వెళ్లాలంటే బర్లపెంట రహదారి వైపు బుగ్గవాగు మీద లోలెవర్ కాజ్‌వే ఉన్నప్పటికీ వాగు పొంగితే ఆటంకంగా మారుతుంది.
చొరవ తీసుకోవాలి..
గత జనవరిలో శంకుస్థాపన జరిగినా నేటి వరకు పనులు మొదలు పెట్టలేదు. వచ్చే వర్షాకాలం నాటికి పూడిక తీసే పనులు అయినా పూర్తి కాకపోతే కష్టంగా మారుతుంది. అధికారులు తక్షణం చొరువ తీసుకోవాలి. టెండర్, ఒప్పందం జరిగినా ఎందుకు చేపట్టడం లేదో అంతుపట్టడం లేదు.
–దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,
మున్సిపల్ మాజీ చైర్మన్
ఇప్పటికై నా మొదలు పెట్టాలి..
బుగ్గవాగు ప్రధానంగా 4వ వార్డు గుండా ప్రవహిస్తోంది. వర్షాకాలం వాగు ఉప్పొంగితే ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతారు. సుందరీకరణ వేగంగా చేపట్టి వర్షాకాలం నాటికి పూర్తి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
–సయ్యద్ ఆజమ్, మాజీ కౌన్సిలర్ ఇల్లెందు
పాలకవర్గం లేక..
గత జనవరిలో పాలక వర్గం పదవీ కాలం ముగిసింది. పాలక వర్గం లేకపోవటం వల్ల అభివృద్ధి కుంటు పడిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా ఇప్పట్లో ఎన్నికలు పెట్టే స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించటం లేదు. ఎన్నికల ఊసే లేకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పట్టణంలో సగభాగం గుండా ప్రవహించే ఈ వాగు ప్రక్షాళన, సుందరీకరణ జరిగితేనే కంటి నిండా నిద్రపోయే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.

వాగు.. బాగుపడేనా..?

వాగు.. బాగుపడేనా..?