
రైస్ పుల్లింగ్ మిషన్ పేరుతో బురిడీ
బూర్గంపాడు: రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకానికి ఉందని మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం బూర్గంపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ రాజేశ్ కథనం ప్రకారం.. శనివారం సిబ్బందితో సారపాకలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా.. అదుపులోకి తీసుకుని విచారించడంతో రైస్ పుల్లింగ్ మిషన్ ఉందని నమ్మించి పలువురిని మోసగించామని ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో చర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన కొమరం రాజబాబు వద్ద రూ.లక్ష తీసుకున్నారు. అతను రైస్ పుల్లింగ్ మిషన్ అడుగగా మరో రూ.లక్ష కావాలని డిమాండ్ చేయగా.. జనవరి 25న రాజబాబు డబ్బుతో మండలంలోని క్రాస్‌రోడ్డు వద్దకు వచ్చాడు. ఈ ముఠా రాజబాబును కొట్టి రూ.లక్ష తీసుకుని కారులో పరారైంది. వీరితో పాటు జంగారెడ్డిగూడెంనకు చెందిన నారాయణ ఉన్నారు. కాగా, భద్రాచలంలో కొందరిని కలిసి రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకానికి ఉందని నమ్మించి మోసగించేందుకు యత్నిస్తున్న ఈ ముఠా సారపాకలో పోలీసులకు పట్టుబడింది. ఈ ముఠాలో పాల్వంచలోని తెలంగాణనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ దొనకొండ సురేశ్‌బాబు, భద్రాచలం పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ అబ్దుల్ రవూఫ్, చర్ల మండలం విజయకాలనీకి చెందిన టైలర్ ఉర్ల శ్రీనివాసరావు ఉన్నారు. జంగారెడ్డిగూడెంనకు చెందిన నారాయణ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ.1.90 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్‌ఐ వెల్లడించారు.
పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు