
అగ్నిప్రమాదాలతో జాగ్రత్త
రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ●
● జిల్లాలో ఐదు ఫైర్‌స్టేషన్లు ● ప్రమాదం జరిగితే డయల్–101కు సమాచారం ఇవ్వాలి
కొత్తగూడెంటౌన్: వేసవికాలం వస్తే అగ్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. గ్రామీణ ప్రాంతాల్లో గడ్డివాములు, గుడిసెల్లో పంటలు కోసిన తర్వాత వాటికి నిప్పు పెట్టే విషయంలో అజాగ్రత్తగా ఉంటే నిప్పు రవ్వలు ఎగసిపడి ఇతర ఇళ్లకు అంటుకుని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి మురహరి క్రాంతికుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదాల నుంచి ఎలా బయట పడాలి, ఎలా రక్షించుకోవాలనే విషయాలను ప్రాక్టికల్‌గా డ్రిల్ చేసి అవగాహన కల్పిస్తారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట ఫైర్ స్టేషన్‌ల పరిధిలో 51 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 28 మంది ఉన్నారు. మరో 23 మంది కొరత ఉంది. 1944లో ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్ యార్డ్‌లోని నౌకలో అగ్ని ప్రమాదం సంభవించగా, విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారు. వారి జ్ఞాపకార్థం వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
మూడేళ్లలో జరిగిన ఘటనలు..
● 2022లో మొత్తం 351 అగ్ని ప్రమాదాలు సంభవించగా.. రూ.2,62,4000 నష్టం వాటిల్లింది. 62 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు.
● 2023లో మొత్తం 265 అగ్నిప్రమాదాలు జరగగా రూ.32,19,6000 నష్టం జరిగింది. రూ.15,31,64000 సొత్తును రక్షించారు. 77 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు.
● 2024లో మొత్తం 232 అగ్నిప్రమాదాలు సంభవించాయి. రూ.07,38,10,000 నష్టం వాటిల్లింది. 66 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు.
● 2025లో మార్చి వరకు మొత్తం124 అగ్నిప్రమాదాలు జరిగాయి. రూ.1,12,40,007 నష్టం జరిగింది. 66 ఘటనల్లో మనుషులు, పశువును రక్షించారు.
డయల్101కి సమాచారం ఇవ్వాలి
ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మూడేళ్లలో 972 ప్రమాదాలు సంభవించగా దాదాపు రూ.13,88,70,007 ఆస్తులకు నష్టం వాటిల్లింది. జిల్లాలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్నతాధికారులకు అధికారులకు నివేదిస్తాం. ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే డయల్–101కు సమాచారం ఇవ్వాలి.
మురహరి క్రాంతికుమార్, డీఎఫ్‌ఓ
ఈ సూత్రాలు పాటించాలి..
అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, దుకాణ సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి.
అపార్డుమెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌మాళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతి ప్లాట్‌కు నీరు అందేలా పైపులైన్‌ను ఏర్పాటు చేయాలి.
షాపుల్లో మండే స్వభావం ఉన్న వస్తువులను పెట్టకూడదు
ఇంట్లో ఉండే సిలిండర్లకు వేడి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి.
ఇళ్లల్లో, షాపుల్లో వెంటిలేషన్‌ను సరిగ్గా ఉండేలా చూడాలి.
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.
గృహాలు, రైస్‌మిల్లులు, ఆఫీసులు, దుకాణాల్లో నాణ్యమైన కరెంట్ వైరింగ్ చేయించుకోవాలి.

అగ్నిప్రమాదాలతో జాగ్రత్త