
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో కానిస్టేబుల్ ప్రతిభ
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ నెల 20 నుంచి 26 వరకు జరుగుతున్న 7వ జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సోమవారం జరిగిన జావెలిన్ త్రో పోటీలో ప్రసాద్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ప్రసాద్‌ను పోలీస్ ఉన్నతాధికారులతో పాటు పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు అభినందించారు.
ఖమ్మం రీజియన్‌లో అగ్రస్థానం
గుండాల: ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల కేంద్రంలోని గురుకుల కళాశాల ఖమ్మం రీజియన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బైపీసీ సెకండియర్‌లో సఫియా 917 మార్కులు సాధించింది. కస్తూర్బా కళాశాలలో ఫస్టియర్‌లో 21 మందికి అందరూ, సెకండియర్‌లో 10 మందికి 10 మంది ఉత్తీర్ణులయ్యారు. గుండాల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ 96 మందికి 72 మంది, సెకండియర్‌లో 76కు 75 మంది ఉత్తీర్ణత సాధించారు. యూఆర్‌జేసీలో ద్వితీయ సంవత్సరం 30 మందికి 30 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఎంపీసీలో బి.సతీశ్‌కుమార్ 985, బైపీసీలో జె.భరత్‌కుమార్ 863, సీఈసీలో కె.హేమంత్ 797 మార్కులు సాధించారు.
కేసు నమోదు
ఇల్లెందు: మండలంలోని హనుమంతులపాడు గ్రామానికి చెందిన కీసరి మౌనికను ఆమె భర్త నెహ్రూ, అత్త గురువమ్మ, బావ శ్రీను కొంతకాలంగా వేధిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెహ్రూ మద్యానికి బానిసగా మారి భార్య మౌనికను ఇబ్బంది పెడుతున్నాడు. తాళలేక మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ మసీనా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడి ఆత్మహత్య
కరకగూడెం: మద్యానికి బానిసై ఓ వృద్ధుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేకుంది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన తాళ్ల మురళి (63) మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో పురుగులమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం మృతుడి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
మొక్కజొన్న కంకులు దగ్ధం
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం శివారులో బంధంకుంట చెరువు సమీపంలోని మొక్కజొన్న చేనులో కుప్పగా పోసిన కంకులు మంగళవారం దగ్ధమయ్యాయి. రైతులు గుడిపెల్లి సుధాకర్, మంచె రామనాథం, మంచె రవీందర్, మంచె శ్రీనుకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలోని మొక్కజొన్న పంటకు సంబంధించిన కంకులను కోసి, చేనులోనే కుప్పగా పేర్చారు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నేల తడిగా ఉండటంతో కుప్పలు పూర్తిగా కాలిపోకుండా కాపాడుకోగలిగారు. అయినప్పటికీ తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
విద్యుదాఘాతంతో
సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి
చర్ల : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో విద్యుత్ షాక్‌తో ఓ జవాను మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా గంగులూరు సీఆర్‌పీఎఫ్ 195వ బెటాలియన్ క్యాంప్‌లో జవాన్‌గా పని చేస్తున్న సుజోయ్‌పాల్ (34) సోమవారం సాయంత్రం ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డుకు మరమ్మతు చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. దీంతో సహచర జవాన్లు గంగులూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని బీజాపూర్‌కు తరలించి శవ పంచనామా అనంతరం అతడి స్వస్థలమైన పశ్చిమ బెంగాల్‌కు మంగళవారం తరలించినట్లు ఏఎస్పీ చంద్రకాంత్ గవర్ణ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
టేకులపల్లి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్‌తండాకు చెందిన బాణోతు వినోద్ ఎలాంటి అనుమతులు లేకుండా శంభునిగూడెం ముర్రేడు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్‌లో నింపుకుని ఇల్లెందుకు తరలిస్తుండగా ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి వినోద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో కానిస్టేబుల్ ప్రతిభ