సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలిగొన్న కరోనా మహమ్మారి గత ఏడాదిన్నర కాలంలో చాలా మందిని ఆన్‌లైన్ బానిసలుగానూ మార్చిందని తాజా సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్... ‘నార్టన్ లైఫ్‌లాక్’ పేరుతో ఇటీవల వివిధ దేశాల్లో ఆన్‌లైన్ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా భారతీయుల విభాగంలో సుమారు వెయ్యి మందిపై చేపట్టిన అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్‌లైన్ వ్యసనానికి బానిసలయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఆన్‌లైన్ ద్వారా ఆఫీసు కార్యకలాపాలు, డిజిటల్ చదు వులు వెచ్చిస్తున్న సమయమే కాకుండా అదనంగా కనీసం నాలుగు గంటలపాటు ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్లు దాదాపు 82 శాతం మంది తెలిపారు.
వాటిల్లోనూ స్మార్ట్‌ఫోన్లతో గడిపే కాలం ఎక్కువైందని తెలిపిన వారు 84 శాతం వరకూ ఉండటం గమనార్మం. సర్వే చేసిన వాళ్లల్లో సగం మంది భద్రతాపరమైన కారణాల రీత్యా ఇంటికి సరికొత్త స్మార్ట్ పరికరాలను కొనడం లేదని స్పష్టం చేశారు. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్న స్పృహ మూడొంతుల మంది (74%)లో ఉండటం ఇంకో విశేషం. మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం ఉంటుందని చెప్పినవారు దాదాపు 55 శాతం. అదే సమయంలో బంధుమిత్రులతో మాట్లాడటం ద్వారా స్క్రీన్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని 76 శాతం మంది చెప్పడం గమనార్హం.
ప్రైవసీ భయాలు
ఇళ్లలో ఉండే స్మార్ట్ హోం పరికరాల ద్వారా వ్యక్తిగత సమాచారం బట్టబయలవుతుందన్న ఆందోళన నార్టన్ కంపెనీ సర్వే చేసిన ప్రతి ఐదుగురిలో ఇద్దరు భావిస్తున్నారు. భద్రతపరమైన కారణాలతో స్మార్ట్ హోం పరికరాలను కొనబోమని 48 శాతం మంది చెబితే ప్రైవసీ భయాలను కారణంగా చూపిన వారు 40% మంది. వినియోగదారుల సమాచారాన్ని కం పెనీ ఇతర అవసరాల కోసం వాడుకుంటుందని 35% మంది గట్టిగా నమ్ముతున్నారు. ఇందుకు తగ్గ ట్టుగానే ఇంట్లో స్మార్ట్ హోం పరికరాలు ఉన్న వారిలో 22% మంది రక్షణ కోసం తామేమీ అదనపు చర్యలు తీసుకోవడం లేదని, పరికరంలో ముందుగానే ఏర్పాటైన సెక్యూరిటీతోనే సరిపుచ్చుకుంటున్నామని చెప్పడం గమనార్హం.
పాస్‌వర్డ్‌లుగా వ్యక్తిగత సమాచారం
పాస్‌వర్డులుగా వ్యక్తిగత సమాచారం వాడేవారు 82% ఉండగా.. ఇందులోనూ పుట్టిన రోజులను లేదా భార్య, పిల్లల పేర్లను వాడేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. 69 శాతం మంది ఏదో ఒక పేరును వాడుతున్నట్లు చెబితే పుట్టిన రోజును వాడేవాళ్లు 58 శాతం మంది ఉన్నట్లు నార్టన్ లైఫ్‌లాక్ సర్వే తెలిపింది. వైఫై రౌటర్లు ఉన్న భారతీయుల్లో 72 శాతం మంది తాము రౌటర్ పాస్‌వర్డ్‌ను ఏడాదికి ఒకసారి మారుస్తున్నట్లు చెబితే నెలకోసారి మారుస్తామని కేవలం 26 శాతం మంది మాత్రమే తెలిపారు. తాము ఇప్పటివరకూ పాస్‌వర్డ్ మార్చనేలేదని అంగీకరించిన వారు తొమ్మిది శాతం మంది!
పిల్లలకు చెప్పాలి
సైబర్ భద్రత గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్న వయసు నుంచే నేర్పించాలని సర్వే చేసిన వాళ్లలో 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. కానీ ఆన్‌లైన్ వ్యవహారాల్లో పిల్లలను కాపాడుకోవడం కష్టమేనని 75 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ‘కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ వ్యవహారాల్లో పెరుగుదల అనివార్యమైంది. కానీ ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ సమయాల మధ్య సమతౌల్యం పాటించడం కూడా ముఖ్యం. లేదంటే ఆరోగ్యం మరీ ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది’ అని నార్టన్ లైఫ్‌లాక్ డైరెక్టర్ రితేశ్ చోప్రా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment