Bharat Bandh On 28,29 March: All India Bank Employees Association Called For A Nationwide Strike - Sakshi
Sakshi News home page

Bharat Bandh Today: రెండు రోజులు బ్యాంకులు బంద్‌! ఖాతాదారులపై సర్వీస్‌ చార్జీల భారం తగ్గించాలి..

Published Mon, Mar 28 2022 7:09 AM | Last Updated on Mon, Mar 28 2022 9:16 AM

All India Bank Employees Association Called For A Nationwide Strike - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ సేవలకు 28, 29 తేదీల్లో పాక్షిక అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, ఉద్యోగ ప్రతికూల ఆర్థిక విధానాలను నిరసనగా సోమ, మంగళవారాల్లో సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల్లోని ఒక వర్గం మద్దతునివ్వడం దీనికి కారణం. ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశ వ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. కార్మిక చట్ట సంస్కరణలు, ప్రైవేటీకరణ, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) విధానాలను కేంద్రం వెనక్కు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద వేతనాల పెంపు, ఇతర కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణ వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.  

బ్యాంకింగ్‌ డిమాండ్లు ఇవీ.. 
బ్యాంకింగ్‌ రంగంలోని డిమాండ్లపై కూడా దృష్టి సారించాలని డిమాండ్‌ చేస్తూ  సమ్మెకు మద్దతు ఇవ్వాలని, ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిలిపివేసి వాటిని బలోపేతం చేయాలని, మొండిబకాయిల (ఎన్‌పీఏ) సత్వర రికవరీకి చర్యలు తీసుకోవాలని, ఖాతాదారులపై సర్వీస్‌ చార్జీల భారం తగ్గించాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని బ్యాంకు యూనియన్‌ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐసహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె కారణంగా తమ సేవలకు పాక్షిక అంతరాయం కలగవచ్చని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.  

బుధవారం కూడా... 
కాగా, బుధవారం కూడా కస్టమర్లకు బ్యాంకింగ్‌ సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. 2021–22కు సంబంధించి ప్రభుత్వ ఖాతా లావాదేవీల వార్షిక ముగింపు ప్రక్రియలో పాల్గొనాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించడం దీనికి నేపథ్యం. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే నిర్దిష్ట (ఏజెన్సీ) బ్యాంకు బ్రాంచీలు ఆయా లావాదేవీలను తప్పనిసరిగా అదే ఆర్థిక సంవత్సరంలో ముగించాల్సిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ ప్రత్యేక ఆదేశాలతో ఆర్థిక సంవత్సరం చివరిరోజు గురువారం నిర్దిష్ట బ్యాంక్‌ బ్రాంచీలు ప్రభుత్వ చెక్కుల క్లియరెన్స్‌ను చేపడతాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement