హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంకుర సంస్థలకు ఊరటనిచ్చే దిశగా అన్ని తరగతుల ఇన్వెస్టర్లకు ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌నకు, నవకల్పనలకు ఊతమివ్వడానికి ఇది తోడ్పడగలదని ఆమె తెలిపారు.
సముచిత మార్కెట్ విలువకు మించిన వేల్యుయేషన్లతో అన్‌లిస్టెడ్ కంపెనీలు లేదా స్టార్టప్‌లు సమీకరించే నిధులపై విధించే ఆదాయ పన్నును ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. ఇది స్టార్టప్‌లతో పాటు ఇన్వెస్ట్ చేసే మదుపర్లకు సమస్యగా మారింది. గతంలో ఏంజెల్ ట్యాక్స్ స్థానిక ఇన్వెస్టర్లకే పరిమితం కాగా 2023–24లో కేంద్రం దీన్ని విదేశీ పెట్టుబడులకు కూడా వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్‌లో దీన్ని తొలగించాలంటూ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) సిఫార్సు చేసింది.
నూతన ఆవిష్కరణలకు, భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారడానికి మార్గం సుగమం చేసే దిశగా ఇది కీలక అడుగని టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇది అంకుర సంస్థలతో పాటు వాటికి మద్దతుగా నిల్చే ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీలు, వెంచర్ ఫండ్స్‌కూ సానుకూలమని న్యాయ సేవల సంస్థ ఇండస్‌లా పార్ట్‌నర్ లోకేష్ షా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment