న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) తోడ్పాటు అందించే దిశగా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు ప్రతిపాదించారు. యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఎటువంటి కొలేటరల్ లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా టర్మ్ లోన్స్ తీసుకునే వెసులుబాటు లభించేలా రుణ హామీ పథకాన్ని ప్రకటించారు.
దీనికోసం విడిగా సెల్ఫ్–ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ఒక్కో దరఖాస్తుదారుకు రూ. 100 కోట్ల వరకు రుణాలకు (తీసుకున్న రుణ మొత్తం ఎంతైనా సరే) హామీ ఇస్తుందని పేర్కొన్నారు. దీన్ని పొందేందుకు రుణగ్రహీత ముందస్తుగా నిర్దిష్ట గ్యారంటీ ఫీజును, రుణ బ్యాలెన్స్ తగ్గే కొద్దీ వార్షిక ఫీజును కట్టాల్సి ఉంటుంది.
ఎస్‌ఎంఈలకు గడ్డు కాలంలో కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు కొత్త విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. తమ పరిధిలో లేని కారణాల వల్ల స్పెషల్ మెన్షన్ అకౌంటు (ఎస్‌ఎంఏ) దశలోకి చేరిన ఎంఎస్‌ఎంఈలు ఆ తదుపరి మొండి బాకీల్లోకి జారిపోకుండా సహాయం పొందేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది.
కొత్త అసెస్‌మెంట్ విధానం..:
ఎంఎస్‌ఎంఈలకు రుణాల విషయంలో కొత్త మదింపు విధానాన్ని మంత్రి ప్రతిపాదించారు. అసెస్‌మెంట్ కోసం బైటి సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు దానికి సంబంధించి అంతర్గతంగా సొంత విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొన్నారు. సంప్రదాయ అసెస్‌మెంట్ విధానంతో పోలిస్తే ఈ మోడల్ మెరుగ్గా ఉండగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక ఎంఎస్‌ఎంఈలు, సంప్రదాయ చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించుకునేందుకు తోడ్పాటు అందించేలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ–కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment