ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన.. | Here's You'll Know Important Aadhaar Card Related Questions And Answers In Telugu - Sakshi
Sakshi News home page

ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన..

Published Sat, Dec 16 2023 10:02 AM | Last Updated on Sat, Dec 16 2023 7:47 PM

Answers For The Questions Of Aadhaar - Sakshi

ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఇటీవల మార్చి 14, 2024 వరకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే.

అయితే యూఐడీఏఐ ఆధార్‌ను ప్రవేశపెట్టి చాలా ఏళ్లు అయింది. దాంతో ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్‌ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. అందుకు సంబంధించి ‘సాక్షి’లో డిసెంబర్‌ 13న ‘ఆధార్‌పై ప్రశ్నలా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అందులో పాఠకులు ఆధార్‌కు సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే info@sakshi.com కు పంపించాలని కోరగా చాలా మంది స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు. ‘సాక్షి బిజినెస్‌’టీమ్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి కొంతమంది పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు.

ప్రశ్న: ఆధార్‌ ఎందుకు, ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలి? అందుకు ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏయే డాక్యుమెంట్లు అవసరం అవతాయి? శైలజ, వరంగల్‌.
జవాబు: నిబంధనల ప్రకారం ఆధార్‌ తీసుకుని 10 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు దాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలి. ఆధార్‌ డేటాబేస్‌లో మీ వివరాలు అప్‌ టు డేట్‌ ఉండాలి. దాంతో ఆధార్‌తో లింక్‌ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో మీ తాజా వివరాలు ఉంటే మేలు. మీ ఆధార్‌లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే చేసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన తేదీలోపు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అందుకోసం పాఠశాల టీసీ, పదో తరగతి మెమో, పాన్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్‌, ఓటర్‌ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌.. వంటి ఫొటో గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి. వీటిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను దగ్గర్లోని ఆధార్‌ కేంద్రానికి వెళ్లి సంబంధించిన ఫారమ్‌ నింపి బయోమెట్రిక్‌, ఐరిస్‌ గుర్తులతో అప్‌డేట్ చేస్తారు.

ప్రశ్న: బ్యాంక్‌ అకౌంట్‌, పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయా? కార్తిక్‌, శ్రీకాకుళం.
జవాబు: లేదు. మీ బ్యాంక్ సమాచారాన్ని బ్యాంక్ యాజమాన్యం ఎవరితోనూ పంచుకోదు. మీ ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా బ్యాంక్ ఖాతా గురించి సమాచారాన్ని పొందలేరు. అలాగే, యూఐడీఏఐతోపాటు ఏ సంస్థ వద్ద మీ బ్యాంక్ ఖాతా గురించి ఎలాంటి సమాచారం ఉండదు. ఉదాహరణకు, మీరు మీ మొబైల్ నంబర్‌ను బ్యాంక్, పాస్‌పోర్ట్ అధికారులు, ఆదాయపు పన్ను శాఖలు మొదలైన వివిధ అధికారులకు ఇస్తారు. కానీ మీరు ఉపయోగిస్తున్న టెలికాం కంపెనీకి మీ బ్యాంక్ సమాచారం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు వంటి సమాచారం గురించి తెలియదు. అదేవిధంగా మీరు వివిధ సర్వీస్ ప్రొవైడర్‌లకు ఆధార్ నంబర్‌ను ఇచ్చినపుడు మీ వివరాలు వారి వద్దే ఉంటాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం, యూఐడీఏఐతో సహా ఏ సంస్థ కూడా యాక్సెస్ చేయలేదు.

ప్రశ్న: నా ఆధార్, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ తెలిసిన ఎవరైనా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా? సులోచన, విజయవాడ. 
జవాబు: కేవలం మీ బ్యాంక్ ఖాతా నంబర్‌, ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకోలేరు. డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ సంతకం, డెబిట్ కార్డ్, పిన్, ఓటీపీ అవసరం అవుతాయి. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆధార్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ వేలిముద్ర, ఐరిస్‌ లేదా ఓటీపీ నంబరు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

ప్రశ్న: ఆధార్‌ను ఎక్కడైనా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. మరి యూఐడీఏఐ ప్రజలు తమ ఆధార్ నంబర్‌ను సోషల్ మీడియా లేదా పబ్లిక్ డొమైన్‌లో పెట్టవద్దని ఎందుకు సూచిస్తోంది? కేతన్‌, నిజామాబాద్‌.
జవాబు: మీరు పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ చెక్‌లను అవసరమైన చోటే ఉపయోగిస్తారు. అయితే ఈ వివరాలను ఇంటర్నెట్, ఫేస్‌బుక్, ఎక్స్‌(ట్విట్టర్) మొదలైన సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ఉంచరుకదా. ఆధార్ విషయంలో కూడా ఇదే లాజిక్‌ని ఉపయోగించాలి. మీ వ్యక్తిగత వివరాలు అనవసరంగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచవద్దు. 

ప్రశ్న: ఆధార్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? శరణ్య, అనంతపురం జిల్లా.
జవాబు: ఆధార్‌ను చాలా ప్రభుత్వ పథకాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు..

  • ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం.
  • ఉపాధి-మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం.
  • జననీ సురక్ష యోజన, ఆదిమ తెగల సమూహాల అభివృద్ధి, జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం.
  • ఆరోగ్య సంరక్షణ – రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఆస్తి లావాదేవీలు, ఓటర్‌ఐడీ, పాన్‌కార్డ్ మొదలైన ఇతర ప్రయోజనాల కోసం ఆధార్‌ కావాల్సి ఉంటుంది. 

ప్రశ్న: యూఐడీఏఐ అనుసరిస్తున్న డేటా భద్రత చర్యలు ఏమిటి? సుశీల, హైదరాబాద్‌.
జవాబు: ప్రజల నుంచి సేకరించిన డేటాకు భద్రత కల్పించే బాధ్యత యూఐడీఏఐకు ఉంది. యూఐడీఏఐ సమగ్ర భద్రత విధానాన్ని కలిగి ఉంది. పటిష్ఠమైన సెక్యూరిటీ స్టోరేజ్‌ ప్రోటోకాల్స్‌ ఉన్నాయి. ఏదైనా సమాచారాన్ని యాక్సెస్‌ చేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్‌ చట్టాలకు లోబడి చర్యలు తీసుకుంటారు.

ఇదీ చదవండి: ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంచిన ఎల్‌ఐసీ.. ఎంతంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement