ఆరు రోజుల రికార్డ్ ర్యాలీకి సోమవారం బ్రేక్ పడినప్పటికీ మంగళవారం తిరిగి అమెరికా స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రధానంగా ఐఫోన్ల దిగ్గజం యాపిల్, రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ జంప్‌చేయడంతో ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఎస్‌అండ్‌పీ 26 పాయింట్లు(0.75%) బలపడి 3,527కు చేరగా.. నాస్‌డాక్ 164 పాయింట్లు(1.4%) జంప్‌చేసి 11,940 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 216 పాయింట్లు(0.8%) ఎగసి 28,646 వద్ద స్థిరపడింది. ఆగస్ట్‌లో తయారీ రంగ పీఎంఐ గణాంకాలు 19ఏళ్ల గరిష్టాన్ని తాకడంతో సెంటిమెంటుకు బూస్ట్ లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు.
దిగ్గజాల అండ
ఈ నెలాఖరు నుంచి మెంబర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొనడంతో వాల్‌మార్ట్ 6 శాతం జంప్‌చేసింది. రీసెర్చ్ సంస్థలు బయ్ రేటింగ్ ద్వారా టార్గెట్ ధరను పెంచడంతో యాపిల్ ఇంక్ 4 శాతం ఎగసింది. 5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించనున్నట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 4 శాతం పతనమైంది. ఇక జూమ్ షేరు ఏకంగా 41 శాతం దూసుకెళ్లింది. క్యూ2లో పటిష్ట ఫలితాలకుతోడు.. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడం జూమ్ కౌంటర్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఆగస్ట్‌లో స్పీడ్
గత నెలలో యూఎస్ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. డోజోన్స్ 7.6 శాతం, ఎస్‌అండ్‌పీ 7 శాతం చొప్పున పుంజుకోగా.. నాస్‌డాక్ మరింత అధికంగా 9.6 శాతం దూసుకెళ్లింది. వెరసి 2020 జనవరి నుంచి ఎస్‌అండ్‌పీ 8.3 శాతం, నాస్‌డాక్ 31.2 శాతం ర్యాలీ చేయగా.. డోజోన్స్ 0.4 శాతం వెనకడుగులో ఉంది. ఇందుకు ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలు దోహదం చేశాయి. ఆగస్ట్‌లోమైక్రోసాఫ్ట్ 10 శాతం లాభపడగా.. 2020లో ఇప్పటివరకూ 43 శాతం జంప్‌చేసింది. ఇదే విధంగా గత నెలలో యాపిల్ ఇంక్ 21.4 శాతం పుంజుకోగా.. ఈ ఏడాదిలో 76 శాతం దూసుకెళ్లింది.
టెస్లా జోరు
ఆగస్ట్‌లో యాపిల్ ఇంక్ 4:1 నిష్పత్తిలోనూ, టెస్లా ఇంక్ 5:1 నిష్పత్తిలోనూ షేర్ల విభజనను చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌లో టెస్లా ఇంక్ షేరు 74 శాతం జంప్‌చేసింది. ఈ షేరు 2020లో ఇప్పటివరకూ 496 శాతం దూసుకెళ్లడం విశేషం! కాగా.. డోజోన్స్‌లో ఎగ్జాన్ మొబిల్, ఫైజర్ ఇంక్, రేథియాన్ టెక్నాలజీస్ చోటు కోల్పోగా.. వీటి స్థానే సేల్స్‌ఫోర్స్.కామ్, యామ్జెన్ ఇంక్, హనీవెల్ ఇంటర్నేషనల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment