హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద సంస్థలతో పోలిస్తే లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) ఎదుర్కొనే సవాళ్లు విభిన్నంగా ఉంటాయని ఐసీఐసీఐ లాంబార్డ్ ఈడీ సంజీవ్ మంత్రి తెలిపారు. ప్రకృతిపరమైన లేదా వ్యాపారపరమైన విపత్తులు ఎలాంటి వాటినైనా ఎదుర్కొనేందుకు పెద్ద సంస్థలకు తగిన ఆర్థిక వనరులు ఉంటాయని.. కానీ స్వల్ప మార్జిన్లతో పని చేసే చిన్న సంస్థలకు వాటిని ఎదుర్కొనేంత ఆర్థిక సామర్థ్యాలు పెద్దగా ఉండవని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వాటికి బీమా ఉపయోగపడుతుందన్నారు.
ఒక్కో ఎంఎస్‌ఎంఈ రిస్కులు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి తమకు అనువైన, తగినంత కవరేజీ ఇచ్చే పాలసీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దీన్ని వ్యయంగా గాకుండా భరోసాగా పరిగణించాలని పేర్కొన్నారు. దేశీయంగా 6.2 కోట్ల పైచిలుకు వ్యాపార సంస్థలు ఉన్నప్పటికీ ఎస్‌ఎంఈ బీమా తీసుకున్న వాటి సంఖ్య 3 శాతం కన్నా తక్కువే ఉంటుందని ఆయన చెప్పారు.
బీమా ప్రయోజనాలపై అవగాహన తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని మంత్రి వివరించారు. దీనితో ఈ అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ మొదలుకుని కారు, ఫోన్ల వరకూ అన్నింటినీ ఇన్సూర్ చేయించుకోవచ్చని అర్థమైతే చిన్న సంస్థలు.. బీమాను ఒక వ్యయంగా కాకుండా రిస్కులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడే సాధనంగా చూడటం మొదలుపెడతాయని మంత్రి చెప్పారు.
టెక్నాలజీతో సెటిల్మెంట్ వేగవంతం..
ఇక, ఎస్‌ఎంఈల విశిష్ట అవసరాలను గుర్తించి తాము కృత్రిమ మేథ, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి ఉపయోగించి క్లెయిమ్ సెటిల్మెంట్‌లను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రూ. 5 లక్షల వరకు ప్రాపర్టీ, మెరైన్ క్లెయిమ్‌లను పది రోజుల్లోపే ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈల బీమా అవసరాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రూప్ హెల్త్, లయబిలిటీ, ఇంజినీరింగ్ ఇన్సూరెన్స్ వంటి పలు పాలసీలు అందిస్తున్నట్లు మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment