
అహ్మదాబాద్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ, కొత్త ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అహ్మదాబాద్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టుతో కీలక ఒప్పందం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు తమ ప్రధాన భాగస్వామిగా అథర్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొంటున్న గుజరాత్ టైటాన్స్ అధికారిక జట్టు జెర్సీల మీద అథర్ ఎనర్జీ బ్రాండ్ పేరు కనిపించనుంది. అథర్ ఎనర్జీ సంస్థ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 24 నగరాల్లో తన ఉనికిని చాటింది.
రాబోయే 12 నెలల్లో 100కు పైగా నగరాల్లో విస్తరించాలని భావిస్తుంది. 2013లో మద్రాస్ పూర్వ విద్యార్థులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ స్థాపించిన అథర్ ఎనర్జీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా అథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం, కంపెనీ భారతదేశం అంతటా 30 రిటైల్ అవుట్ లెట్లు కలిగి ఉంది. మార్చి 2023 నాటికి, 100 నగరాల్లో 150 అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తోంది. అథర్ ఎనర్జీ అత్యంత పోటీ ఉన్న ఆటోమోటివ్ రంగంలో తన పంత ఎంతో నిరూపిస్తుంది. ఐపీఎల్‌లో ఇతర జట్లకు యువ జట్టు గుజరాత్ టైటాన్స్ పోటీ ఇస్తుందని సంస్థ పేర్కొంది.గుజరాత్ టైటాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా అథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
(చదవండి: ఎలాన్ మస్క్ భారీ విరాళం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!)