నేడు (31న) దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 44 పాయింట్లు బలపడి 11,129 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,085 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. చివరి రోజు జులై ఫ్యూచర్స్ 11,101 వద్ద స్థిరపడగా.. నేటి నుంచి ఆగస్ట్ నెల డెరివేటివ్ సిరీస్ ప్రారంభంకానుంది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ క్యూ2లో 33 శాతం వెనకడుగు వేయడంతో గురువారం డోజోన్స్, ఎస్‌అండ్‌పీ 0.9-0.4 శాతం మధ్య బలహీనపడగా.. నాస్‌డాక్ 0.45 శాతం పుంజుకుంది. అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు 2.7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి ఆటుపోట్లకు లోనుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
నష్టాల ముగింపు
జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ చివరి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. వెరసి గురువారం సెన్సెక్స్ 335 పాయింట్లు పతనమై 37,736వద్ద ముగిసింది. 38,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ సైతం 101 పాయింట్లు కోల్పోయి 11,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,300- 11,085 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,025 పాయింట్ల వద్ద, తదుపరి 10,947 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,240 పాయింట్ల వద్ద, ఆపై 11,377 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,400 పాయింట్ల వద్ద, తదుపరి 21,154 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,073 పాయింట్ల వద్ద, తదుపరి 22,500 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
డీఐఐల అమ్మకాలు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 207 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 387 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 353 కోట్లు, డీఐఐలు రూ. 506 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment