హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గ్రేడ్–ఏ) విభాగంలో బెంగళూరు కొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2022 సెప్టెంబర్ నాటికి 1.06 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసుల్లో ఉన్న సీబీఆర్‌ఈ ఇండియా ప్రకారం.. షాంఘై, బీజింగ్, సియోల్, టోక్యో, సింగపూర్ వంటి 11 ప్రధాన నగరాలను తలదన్ని బెంగళూరు ముందు వరుసలో నిలిచింది. షాంఘై ఒక కోటి, బీజింగ్ 76 లక్షల చ.అడుగుల విస్తీర్ణంతో ఆ తర్వాతి స్థానాలను అందుకున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఫ్లెక్సిబుల్ ఏ–గ్రేడ్ ఆఫీస్ స్థలంలో భారతదేశం ముందుంది. 12 నగరాలతో కూడిన జాబితాలో 66 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఢిల్లీ–ఎన్‌సీఆర్ అయిదవ స్థానంలో ఉంది. 57 లక్షల చ.అడుగులతో హైదరాబాద్ ఏడవ స్థానం ఆక్రమించింది. ఆసియా పసిఫిక్‌లో ప్రీమియం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ రంగంలో ఈ మూడు నగరాల వాటా ఏకంగా 35 శాతానికి చేరింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే గ్రేడ్–ఏ కార్యాలయ భవనాలలో భారత్, సింగపూర్ అత్యధిక ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్థలం కలిగి ఉన్నాయి.
భారత్ అత్యధిక వృద్ధి..
మొత్తం ప్రీమియం ఆఫీస్ స్పేస్‌లో 5.5 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వాటాతో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మహమ్మారి తర్వాత ఫ్లెక్సీ–ఆఫీస్ మార్కెట్‌లో భారత్ అత్యధిక వృద్ధిని సాధిస్తోంది. ఆసియా పసిఫిక్‌లో ఫ్లెక్సిబుల్ స్థలం 6 శాతం వార్షిక వృద్ధితో 7.6 కోట్ల చ.అడుగులు ఉంది. మహమ్మారి ముందు కాలంతో పోలిస్తే 2022 జనవరి–సెప్టెంబర్‌లో 15 శాతం వృద్ధి చెందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొత్తం ఫ్లెక్సిబుల్ కేంద్రాల సంఖ్య సుమారు 3,000 ఉంది. ఫ్లెక్సిబుల్ స్థల వినియోగంలో సాంకేతిక కంపెనీలు 36 శాతం, బిజినెస్ సర్వీసులు 28 శాతం కైవసం చేసుకున్నాయి. ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్, రిటైల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు స్వల్పకాలిక ఒప్పందాలు, అనువైన నిబంధనలతో సేవలు అందిస్తున్నాయి. దీంతో క్లయింట్లకు వ్యయాలు తగ్గుతున్నాయి’ అని ద్వారక ఆఫీస్ స్పేసెస్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఫ్లెక్సిబుల్ కేంద్రాల్లో కార్యాలయాల నిర్వహణకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment