
కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
న్యూఢిల్లీ: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 9.90 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. 2019–20లో అత్యధికంగా రూ. 2.34 లక్షల కోట్లు రైటాఫ్ చేయగా ఆ తర్వాత సంవత్సరంలో ఇది రూ. 2.02 లక్షల కోట్లకు, 2021–22లో రూ. 1.74 లక్షల కోట్లకు తగ్గింది. తర్వాత సంవత్సరంలో ఇది తిరిగి రూ. 2.08 లక్షల కోట్లకు పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరం రూ. 1.70 లక్షల కోట్లకు పరిమితమైంది.
రైటాఫ్ చేసినంత మాత్రాన బాకీలను పూర్తిగా రద్దు చేసి రుణగ్రహీతలకు మేలు చేసినట్లు కాదని, వారు వాటిని చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపర్చుకునేందుకు, పన్ను ప్రయోజనాలు పొందేందుకు, మూలధనాన్ని మెరుగ్గా ఉపయోగించుకునేందుకు నిర్దిష్ట నిబంధనలకు లోబడి బ్యాంకులు మొండి బాకీలను రైటాఫ్ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని రాబట్టేందుకు బ్యాంకుల చర్యలు కొనసాగుతాయని తెలిపారు. గత అయిదేళ్లలో రూ. 1.84 లక్షల కోట్లు రికవర్ అయినట్లు మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment