Ghar, Padosi, Bacche Hi Rishtedar Ek Samosa Toh Banta Hai Yaar నవ్వొస్తుంది కదా. బట్ ఇదే ట్యాగ్ లైన్‌తో సమోసా సింగ్ అనే కంపెనీ మొత్తం మార్కెట్‌నే క్యాప్చర్ చేస్తోంది. ఇప్పటికే వందల కోట్ల సమోసా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. భవిష్యత్‌లో ప్రపంచ దేశాల్లో సైతం సమోసాలు అమ్మి వేలకోట్ల టర్నోవర్ సాధించేలా ప్రణాళికలు రచిస్తుంది. తోపుడు బండి మీద సమోసాలు అమ్మిన నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్..వందల కోట్ల వ్యాపారంగా ఎలా తీర్చిదిద్దారు. పూలమ్మిన చోటే కట్టెలమ్మే అనే సామెతను తిరగరాసిన ఈ దంపతులిద్దరూ సమోసాలు ఎందుకు అమ్మాలనుకున్నారో తెలుసుకుందాం పదండి.
కరణ్ జోహార్ సినిమా తరహాలో రియల్ లైఫ్‌లో హీరో శిఖర్ వీర్ సింగ్, హీరోయిన్ నిధి సింగ్ బ్యాచిలర్ బయోటెక్నాలజీ డిగ్రీని పూర్తి చేసేందుకు 2004లో థానేలోని కురకేత్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే? రీల్ లైఫ్ తరహాలో రియల్ లైఫ్‌లో శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్‌లు స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారారు. అలా అని చదువును ఆటకెక్కించలేదు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారు.
అనంతరం నిధి బయోటెక్నాలజీ చదవనైతే చదివింది కానీ మనసంతా మార్కెటింగ్ వైపే మళ్లింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా థానే నుంచి ఢిల్లీకి పయనమైంది. ఢిల్లీలో అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో జాయిన్ అయింది.
లైఫ్ సైన్సెస్ అమితంగా ఇష్టపడే శిఖర్ మాస్టర్స్ చేసేందుకు ఉన్నత చదువుల కోసం థానే నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. లైఫ్ సైన్సెస్ చదివే సమయంలో శిఖర్ ఫాస్ట్ ఫుడ్ తరహాలో స్నాక్ ఐటమ్స్ అమ్మకాల్లో శుభ్రత లేకపోవడాన్ని గమనించాడు. అన్నీ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలలో పిజ్జాలు, బర్గర్లను అమ్మితే.. అదే ఇండియన్ స్నాక్స్, సావీరస్ (సాల్టీగా-స్పైసీగా) ను వీధుల్లో అమ్మడాన్ని గమనించాడు.
సమోసాలు అమ్ముదాం నిధి
అదిగో అప్పుడే శిఖర్‌కు దిగ్గజ రెస్టారెంట్లకు పోటీగా సమోసా వ్యాపారం చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. తన ఐడియాను నిధికి షేర్ చేశాడు. వ్యాపార మెళుకువలు తెలియని శిఖర్.. కియోస్కోలో సమోసా అమ్మితే ఎలా ఉంటుందని నిధికి తన మనసులో మాట చెప్పాడు.
శిఖర్ 2009లో సైంటిస్ట్‌గా బయోకాన్ కంపెనీలో చేరాడు. కొంత కాలానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి, నచ్చిన జీతం ఇంతకంటే ఏం కావాలి? కానీ వాళ్లు అలా అనుకోలేదు. ఉద్యోగాల నిమిత్తం దేశాలు పట్టుకొని తిరిగినప్పటికీ సమోసా వ్యాపారం చేయాలన్న ఆశ పోలేదు. ఇంకా రెట్టింపు అయ్యింది. వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. శుభ్రత (hygiene)తో పాటు సమోసాను వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు.
జాబ్‌కు రిజైన్ చేసి
సంవత్సరాలు గడిచాయి. చివరికి 2015 అక్టోబర్ నెలలో బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. బిజినెస్ కోసం ఎవరు ఏం చేయాలో డిసైడ్ అయ్యారు. అందుకు నిధి అమోదం తెలపడంతో తన స్టార్టప్ ప్రయత్నాల్ని ప్రారంభించాడు శిఖర్. అక్టోబర్ 13, 2015లో శిఖర్ తాను చేస్తున్న జాబ్‌కు రిజైన్ చేశాడు.
నిధి తాను కూడా జాబ్‌కు రిజైన్ చేస్తానంటే కంపెనీ ఒప్పుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ స్టార్టప్ ప్రారంభించుకోమని ఆఫర్ ఇచ్చింది. వెంటనే వాళ్లిద్దరూ కలిసి రెండు చిన్న కిచెన్ రూమ్‌లు అద్దెకు తీసుకున్నారు. వంట చేసే వాళ్లను నియమించుకున్నారు. పరిశోధన- అభివృద్ధి (Research and Development)లో నిమగ్నమయ్యారు.
నాలుగు నెలల కష్టం
4 నెలల పాటు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని వినూత్నంగా పలు షేపుల్లో సమోసాను తయారు చేశాడు శిఖర్. బిజినెస్ ప్రారంభించాలన్న తమ ప్రయత్నాల్లో ఎట్టకేలకు మరో అడుగు ముందుకు వేశారు. ఆర్ అండ్ డీలో రకరకాల రుచులతో సమోసాలు వేయించాలి. కాల్చకూడదు, జిడ్డు లేకుండా ఆరోగ్యం ఉండాలన్న ఆలోచన శిఖర్ బయోటెక్ అనుభవం నేర్పిచ్చింది.
రకరకాల ఫ్లేవర్లతో ప్రత్యేకంగా తయారు చేసిన పిండితో సమోసాపై భాగంగా గట్టిగా ఉండేలా చూసుకున్నారు. అలా సంప్రదాయ సమోసా షేప్ కంటే వీళ్లు తయారు చేసిన సమోసా చూడటానికి బాగుంది. సమోసా ఆకారం ఇలా ఉండడం (కింద ఇమేజ్‌లో చూపించినట్లుగా) వల్ల నూనెను పీల్చుకోదని తెలిపారు. చికెన్ మఖానీ (బటర్ చికెన్), కడాయి పనీర్ నుండి చాక్లెట్ వరకు రకరకాల రుచుల్లో సమోసాలు అందించేందుకు సిద్ధమయ్యారు.
సమోసా సింగ్ పేరు భలే ఉందే
అమ్మేందుకు సమోసా సిద్ధమైంది. ప్రొడక్ట్ ఉంటే సరిపోదు కదా. దానికంటూ పేరుండాలి. అందుకే అందరి నోళ్లలో నానేలా మా సంస్థకు సమోసా సింగ్ అని పేరుపెట్టాం. ఓ రోజు శిఖర్ నా దగ్గరకు వచ్చి కంపెనీ పేరు సమోసా సింగ్ అని చెప్పడంతో ‘అరె ఈ పేరేదో భలే ఉందే అని’ నవ్వుకున్నట్లు నిధి వివరించారు.
తోపుడుబండి మీద సమోసాలు
ప్రొడక్ట్ (సమోసా),పేరు రెడీ. మార్కెటింగ్‌లో మెళుకువలు నేర్చుకున్నారు. ముందుగా తాము తయారు చేసిన సమోసా గురించి కస్టమర్ల నుంచి అభిప్రాయం తెలుసుకునేందుకు తోపుడుబండి మీద సమోసాలు అమ్మారు. రద్దీ ఉండే ఏరియాల్లో కియోస్కోలు ఏర్పాటు చేసి సమోసా గురించి కస్టమర్ల అభిప్రాయాలు సేకరించారు. ఫీడ్‌బ్యాక్ పాజిటీవ్‌గా రావడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బెంగళూరులో సమోసా సింగ్ పేరుతో క్యూఎస్ఆర్ అవుట్ లెట్‌ను ప్రారంభించారు.
నిధి బిల్ కౌంటర్‌ను నిర్వహిస్తుండగా, శిఖర్ కొంతమంది వర్కర్లతో కలిసి సమోసాలు తయారు చేసి అమ్మడం, హోమ్ డెలివరీలు చేయడం ప్రారంభించారు. టేస్ట్ అదిరింది. ధర రీజనబుల్‌గా ఉంది. రెండు సమోసాలు రూ.20, చికెన్ మఖానీ సమోసాలు (రెండు) రూ. 55కే ధర తక్కువగా ఉండడం సమోసా సింగ్‌కు కలిసి వచ్చింది. మౌత్ పబ్లిసిటీ పెరిగి రెండు నెలల్లో ఆర్డర్‌లు రోజుకు 500 సమోసాలు అమ్మే స్థాయికి ఎదిగారు.
భారీ ఆర్డర్ దశ తిరిగింది
బిజినెస్ ఊహించని విధంగా సాగుతుండడంతో నిధి క్యాష్ కౌంటర్ నుంచి..కార్పొరేట్ ఆర్డర్ల కోసం మార్కెటింగ్ విభాగంలో అడుగు పెట్టింది. అలా తనకున్న మార్కెటింగ్ అనుభవంతో జర్మన్ కంపెనీ నుంచి 8వేల సమోసాలను తయారు చేసి ఇచ్చే ఆర్డర్‌ను సంపాదించింది. ఆర్డర్ అయితే వచ్చింది. చేయడం,వాటిని నిల్వ చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉందని భావించారు. సదరు సంస్థను వారం రోజుల సమయం అడిగారు. వారంలో మళ్లీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్‌పై పనిచేశారు. సమోసా చెప్పిన టైంకు చేసి ఆర్డర్ ఇవ్వాలి. ప్రొడక్ట్ చెడిపోకుండా తయారు చేసేలా రీసెర్చ్ చేశారు. షిప్ట్‌ల వారీగా సమోసాలు తయారు చేసి చెప్పిన టైం కంటే ముందే ఆర్డర్ సిద్ధం చేశారు.
ఇల్లు అమ్మి
జర్మనీ ఆర్డర్ తర్వాత సమోసా సింగ్ మారు మ్రోగింది. ఆర్డర్ల సంఖ్య పెరిగింది. వివిధ నగరాల్లో అవుట్ లెట్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కానీ చేతిలో సరిపడ డబ్బు లేకపోవడంతో బెంగళూరులో ఉన్న ఇల్లును అమ్మి వ్యాపారానికి అనువుగా ఉండేలా అవుట్ లెట్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు ఇతర నగరాల్లో సమోసాలు అమ్ముతున్నారు. ఇలా సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.12 లక్షల నుంచి సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతం తమను ఇక్కడికి దాకా తీసుకొచ్చిందని, భవిష్యత్‌లో విదేశీయులతో తమ సమోసాను టేస్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు నిధిసింగ్, శిఖర్ సింగ్‌లు విజయ గర్వంతో చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment