న్యూఢిల్లీ: దేశీ ఇన్వెస్ట్‌మెంట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా విమానయాన రంగంపై దృష్టి సారించారు. ఆకాశ ఎయిర్ పేరిట విమానయాన సంస్థను ప్రారంభిస్తున్నారు. పౌర విమానయాన శాఖ నుంచి దీనికి 15 రోజుల్లో అనుమతులు రావచ్చని ఝున్‌ఝున్‌వాలా వెల్లడించారు. కొత్త ఎయిర్‌లైన్ కోసం నాలుగేళ్లలో దాదాపు 70 విమానాలను సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు ఝున్‌ఝున్‌వాలా వివరించారు.
180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ఎయిర్‌క్రాఫ్ట్‌లను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆకాశ ఎయిర్‌లో ఝున్‌ఝున్‌వాలా సుమారు 35 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. ఆయనకు ఇందులో 40 శాతం వాటాలు ఉండనున్నాయి. అత్యంత చౌక చార్జీల విమానయాన సంస్థగా ఉండబోయే ఆకాశ ఎయిర్ టీమ్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్ సంస్థకి చెందిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు.
కరోనా వైరస్ కట్టడిపరమైన చర్యల కారణంగా దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా విమానయాన సంస్థలు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఝున్‌ఝున్‌వాలా ఈ రంగంలోకి ప్రవేశించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012లో మూతబడగా, జెట్ ఎయిర్‌వేస్ 2019లో దివాలా తీసింది. కొత్త యజమానుల సారథ్యంలో ప్రస్తుతం మళ్లీ ఎగిరే ప్రయత్నాల్లో ఉంది. థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉండటంతో దేశీ విమానయాన సంస్థల రికవరీకి మరింత సమయం పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో కొత్త విమానాల డెలివరీని కూడా వాయిదా వేసుకునేందుకు విమానయాన సంస్థ విస్తార.. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్‌లతో చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన రంగంలోకి ఝున్‌ఝున్‌వాలా ఆరంగేట్రం చర్చనీయాంశంగా మారింది. అయితే, ‘దేశీ విమానయాన రంగంలో డిమాండ్ విషయంలో నేను అత్యంత ఆశావహంగా ఉన్నాను‘ అని ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఫోర్బ్స్ మేగజీన్ తాజా గణాంకాల ప్రకారం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సంపద విలువ సుమారు 4.6 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.
ఆకాశ వీధిలో ఝున్‌ఝున్‌వాలా
Published Thu, Jul 29 2021 1:02 AM | Last Updated on Thu, Jul 29 2021 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment