
ముంబై: ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 6–7 శాతం వృద్ధి చెందనున్నాయి. అలాగే కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 90 శాతం ఆదాయాన్ని రికవర్ చేసుకోనున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. కోవిడ్‌పరమైన ఆంక్షల వల్ల ప్రయాణాలు నిల్చిపోవడంతో రెండేళ్ల పాటు నష్టపోయిన ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభదాయకత .. 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో 6–7 శాతం మేర పుంజుకోవచ్చని పేర్కొంది.
కార్పొరేట్, విహార ప్రయాణాలు మెరుగుపడటంతో ఆదాయాలూ పెరగగలవని క్రిసిల్ తెలిపింది. కోవిడ్ సమయం నుంచి అమలు చేస్తున్న ఆటోమేషన్, వ్యయ నియంత్రణ విధానాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు తిరిగి మహమ్మారి పూర్వ స్థాయిని (2020 ఆర్థిక సంవత్సరం) దాటేయొచ్చని తెలిపింది. 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటింగ్ సంస్థలు వరుసగా 25.8%, 2.7% మేర నిర్వహణ నష్టాలు ప్రకటించాయి. నివేదికలోని మరిన్ని అంశాలు.
► నిర్వహణ పనితీరు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, నికర రుణ రహితంగా ఉండటం వంటి అంశాలు ఆయా సంస్థలకు సహాయకరంగా ఉండనున్నాయి.
► స్వల్పకాలిక విహార యాత్రలకు.. (ముఖ్యంగా భారత్, ఆసియా ప్రాంతాలకు) ప్రాధాన్యం పెరుగుతోంది. యూరోపియన్ దేశాల వీసాల జారీ పుంజుకోవడంతో రాబోయే వేసవి సెలవుల కోసం బుకింగ్‌లు పెరుగుతున్నాయి. అయితే, విహార యాత్రల కోసం అమెరికాకు వెళ్లే ధోరణులు రికవర్ కావడానికి మరింత సమయం పట్టనుంది.
► అంతర్జాతీయ మందగమనం సుదీర్ఘంగా కొనసాగవచ్చన్న ఆందోళనలు తగ్గుముఖం పడుతుండటంతో రాకపోకలు మెరుగుపడనుండటం.. ఆదాయాల వృద్ధికి తోడ్పడనుంది.