మండే ఎండలను మించి పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి రేట్లు సవరిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఈ అంతర్జాతీయంగా ధరలు ఎప్పుడు తగ్గుతాయా అంటూ సామాన్యులు ఎదురు చూస్తున్నారు. రష్యా ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చల రూపంలో ఆ తరుణం రానే వచ్చింది. ఇక పెట్రోలు ధరలు ఏమైనా తగ్గుతాయేమో అనుకునేలోగా మళ్లీ కథ మొదటికి వచ్చింది.
ఉక్రెయిన్ రష్యా యద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటాయి. 2022 మార్చిలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 140 డాలర్లకు ఎగిసింది. మొత్తంగా మార్చి నెల సగటు 112 డాలర్లుగా నమోదు అయ్యింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఈ సగటు ధర 94 డాలర్లు ఉండగా జనవరిలో 84.67 డాలర్లుగా ఉంది. యుద్ధం మొదలైన తర్వాత బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 25 డాలర్లకు పైగానే పెరిగింది. దీంతో మన దగ్గర లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను పది రూపాయలకు పైగానే ఆయిల్ సంస్థలు పెంచాయి.
మార్చి చివరి వారం నుంచి ఉక్రెయిన్ - రష్యాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా రష్యా మొత్తబడుతున్నట్టు కనిపించింది. దీంతో ముడి చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి. ఏప్రిల్ 1 నుంచి 12 వరకు ముడి చమురు సగటు ధర 98.48 డాలర్లుగా వచ్చింది. మార్చి సగటు 112 డాలర్లతో పోల్చితే దాదాపు 13 డాలర్ల వరకు ధర తగ్గింది. యుద్ధం ముగిసిపోతే సాధారణ పరిస్థితులు నెలకొని బ్యారెల్ ధరలు తగ్గి రిటైల్ మార్కెట్‌లో పెట్రోలు ధరలు తగ్గుతాయనే నమ్మకం ఏర్పడింది.
ఉక్రెయిన్ మొండి వైఖరి కారణంగా శాంతి ప్రక్రియల నుంచి వెనక్కి తగ్గుతున్నామని, యుద్ధం మరింత కాలం కొనసాగవచ్చంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన తాజా ప్రకటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. పుతిన్ ప్రకటనకి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 98 డాలర్ల దగ్గర ఉండగా పుతిన్ ప్రకటన వెలువడిన తర్వాత 2022 ఏప్రిల్ 13న 104 డాలర్లకు చేరుకుంది. ఒక్కరోజులోనే దాదాపు 6 డాలర్లు పెరిగింది.
2020 ఏప్రిల్‌లో బ్రెంట్ రకం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ సగటు ధర రూ. 63 డాలర్లుగా ఉంది. ఆ సమయంలో మన దగ్గర లీటరు పెట్రోలు ధర రూ. 75 ఉండగా డీజిల్ ధర రూ.65లుగా ఉంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బ్యారెల్ ధర 99 డాలర్లు ఉండగా హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 119 డీజిల్ ధర 115 దగ్గర ఉంది. యుద్ధం మరింత కాలం కొనసాగితే పెట్రో బాదుడు తప్పేలా లేదు.
చదవండి: అంతర్జాతీయంగా కొన్ని శక్తులు కుమ్మక్కై ధరలు పెంచేస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment