స్టాక్ సూచీలు ఆరోరోజూ దూసుకెళ్లడంతో ఇన్వెస్టర్ల సంపద ఆల్‌టైం హైని అందుకుంది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ.10.56 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. మార్కెట్ ముగిసే సరికి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.272.76 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది.
ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ గురువారమూ కొనసాగింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ రికవరీ కలిసొచ్చింది. ఒక్క ఆటో మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపుల్లో సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ 569 పాయింట్ల లాభంతో 61వేలపైన 61,306 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 18,339 వద్ద నిలిచింది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,116 పాయింట్లు, నిఫ్టీ 692 పాయింట్లు చొప్పు లాభాపడ్డాయి. వచ్చే వారం నుంచి బ్యాంకింగ్ రంగ ఆర్థిక ఫలితాలు వెల్లడి కానున్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 616 పాయింట్లు పెరిగి 61,353 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు ఎగసి 18,351 వద్ద జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేశాయి. అయితే లాభాల స్వీకరణ జరగడంతో ఆటో షేర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1682 కోట్లు షేర్లను కొనగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.1751 కోట్ల షేర్లను అమ్మారు.
లాభాలకు కారణాలు...
మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు...
కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. మంగళవారం(సెప్టెంబర్ 12న) వెల్లడైన ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సానుకూల రీతిలో 11.9 శాతంగా నమోదయ్యాయి. అదే రోజున విడుదలైన సెప్టెంబర్ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి దిగివచ్చింది. ఆహార ధరలు అదుపులోకి రావడంతో సెప్టెంబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టస్థాయి 10.66%గా నమోదైంది.
రూపాయి రెండోరోజూ రికవరీ...
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రెండోరోజూ రికవరీ కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఎఫ్‌ఓఎంసీ మినిట్స్ వెల్లడి ముందు డాలర్‌లో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా డాలర్ మారకంలో 11 పైసలు బలపడి 75.26 వద్ద స్థిరపడింది.
ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు
బాండ్ల ఈల్డ్స్ ర్యాలీ ఆగకపోవడంతో పాటు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టం నుంచి దిగిరావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. ఈ అంశం దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఆసియాలో ఒక్క చైనా మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం నుంచి అరశాతం ర్యాలీ చేశాయి. అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
అండగా ఐటీ షేర్ల ర్యాలీ...
దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. దీంతో సంబంధింత షేర్లలో ర్యాలీ కొనసాగింది. ఇన్ఫీ షేరు ఇంట్రాడేలో నాలుగు శాతం లాభపడి రూ.1784 స్థాయిని తాకింది. అయితే చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో అరశాతం స్వల్ప లాభంతో రూ.1716 వద్ద స్థిరపడింది. విప్రో షేరు ఐదు శాతం లాభంతో రూ.708 వద్ద ముగిసింది. మైండ్ ట్రీ షేరు ఏడున్నర శాతం ఎగసి రూ.4,691 వద్ద నిలిచింది.
నేడు మార్కెట్ సెలవు
దసరా సందర్భంగా శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు సెలవు. బులియన్, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు కూడా పని చేయవు. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో మార్కెట్ సోమవారం ప్రారంభమవుతుంది. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్ 1,247 పాయిం ట్లు, నిఫ్టీ 443 పాయింట్లు లాభపడ్డాయి.
సెన్సెక్స్ స్థాయి చేరేందుకు పట్టిన కాలం
56,000 18 ఆగస్ట్ 2021
57,000 31 ఆగస్ట్ 2021 (13 రోజులు)
58,000 3 సెప్టెంబర్ 2021 (3 రోజులు)
59,000 16 సెప్టెంబర్ 2021 (13 రోజులు)
60,000 24 సెప్టెంబర్ 2021 (8 రోజులు)
61,000 14 అక్టోబర్ 2021(20 రోజులు)
Comments
Please login to add a commentAdd a comment