‘హల్వా’ రుచులతో బడ్జెట్‌ షురూ! | Budget 2023: Traditional Halwa Ceremony Conducted Minister Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

‘హల్వా’ రుచులతో బడ్జెట్‌ షురూ!

Published Fri, Jan 27 2023 2:53 AM | Last Updated on Fri, Jan 27 2023 4:58 AM

Budget 2023: Traditional Halwa Ceremony Conducted Minister Nirmala Sitharaman - Sakshi

’హల్వా’ వేడుక కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్‌ కిషన్‌రావ్‌ కరాద్,  పంకజ్‌ చౌదరి తదితర సీనియర్‌ అధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 

న్యూఢిల్లీ: ఆర్థికశాఖ నార్త్‌బ్లాక్‌ బేస్‌మెంట్‌లో సంప్రదాయ ‘హల్వా రుచుల’ ఆస్వాదనతో  2023–24 వార్షిక బడ్జెట్‌ ముద్రణ పక్రియ గురువారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో తన ఐదవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఈ కార్యక్రమంలో పాల్గొని లాంఛనంగా ‘కడాయి’ని కదిలించారు. అనంతరం సీతారామన్‌సహా ఆర్థికశాఖలోని సీనియర్‌ అధికారులు, సిబ్బంది హల్వా రుచులను ఆస్వాదించారు.

కేంద్ర బడ్జెట్‌లో తుది దశ అయిన ముద్రణ కార్యక్రమం ఈ సాంప్రదాయక  వేడుకతో ప్రారంభమవుతుంది. అయితే 2022లో కరోనా కారణంగా ఈ కార్యక్రమం జరగలేదు. అధికారులు కేవలం స్వీట్స్‌ పంచుకోవడం ద్వారా గత ఏడాది బడ్జెట్‌ ముద్రణ ప్రక్రియను ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలూ కలిసివచ్చేట్లు గురువారం ఈ వేడుక జరగడం గమనార్హం. ‘హల్వా’ వేడుకలో, ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రెస్‌లో కూడా పర్యటించారు. సంబంధిత అధికారులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ముద్రణ సన్నాహాలను సమీక్షించారు.  

యాప్, వెబ్‌సైట్స్‌లో బడ్జెట్‌... 
నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌లో బడ్జెట్‌ పత్రాలను ముద్రించడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది. 1980 నుండి 2020 వరకు 40 సంవత్సరాల పాటు భారీ స్థాయిలో ఈ ముద్రణా కార్యక్రమం జరిగింది. అయితే అటు తర్వాత బడ్జెట్‌ డిజిటల్‌గా మారింది. గత రెండేళ్లలో కనీస అవసర పత్రాల ముద్రణ మాత్రమే జరుగుతోంది. బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో పంపిణీ జరుగుతోంది.

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్‌ పత్రాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్‌ ద్విభాషా (ఇంగ్లీష్,  హిందీ) అలాగే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. కేంద్ర బడ్జెట్‌ వెబ్‌ పోర్టల్‌ www.indiabudget.gov.in నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆర్థికశాఖ  పేర్కొంది.

హల్వా కార్యక్రమం ప్రత్యేకత ఇది..
కీలక హల్యా కార్యక్రమం అనంతరం బడ్జెట్‌ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది.

మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడ్డానికి వీలుండదు.   ఎంతో పకడ్బందీగా తయారయ్యే ఈ బడ్జెట్‌ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను  కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్‌ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. డిజిటల్‌గా మారడం వల్ల ఉద్యోగుల ‘లాక్‌–ఇన్‌ వ్యవధి’ మునుపటి  రెండు వారాల  నుంచి ప్రస్తుతం కేవలం ఐదు రోజులకు తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement