న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. డిసెంబర్ 2న(బుధవారం) ప్రారంభంకానున్న ఇష్యూ 4న(శుక్రవారం) ముగియనుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 59-60. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్‌ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచుతోంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ నిధులను బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే ఇదే గుణిజాల్లో రూ. 2 లక్షల విలువ మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానుంది.
ఐదేళ్లలో..
గ్లోబల్ క్యూఎస్‌ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్‌వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. దేశీయంగా లిస్టయిన ప్రత్యర్ధి సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ స్థాయిలో బర్గర్ కింగ్‌కు ప్రీమియం విలువ లభించకపోవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ సహచర ఈక్విటీ విశ్లేషకులు కేశవ్ లహోటీ ఐపీవో సందర్భంగా అంచనా వేశారు. జూబిలెంట్.. లాభాలు సాధిస్తున్నకంపెనీ కావడంతోపాటు పిజ్జా బ్రాండు దేశీయంగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment