న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి గణాంకాల మదింపు తగిన విధంగా జరగలేదని వస్తున్న విమర్శల్లో ఎటువంటి వాస్తవం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఏప్రిల్–జూన్‌లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయినట్లు గత నెల చివర్లో అధికారిక గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే.
అయితే ‘‘ఇండియాస్ ఫేక్ గ్రోత్ స్టోరీ’’ పేరుతో ప్రాజెక్ట్ సిండికేట్ పోస్ట్ చేసిన ఒక కథనంలో ఆర్థికవేత్త, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక మోడీ తీవ్ర విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత అధికారులు ప్రతికూల స్థూల ఆర్థిక వాస్తవాలను తక్కువ చేసి చూపుతున్నారు. తద్వారా వారు జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు పొగడ్తలతో కూడిన హెడ్‌లైన్ గణాంకాలను విడుదల చేసి ఉండవచ్చు.
కానీ, అత్యధిక మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను కప్పిపుచ్చుతూ వారు ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు. వాస్తవ జీడీపీ గణాంకాలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అసమతౌల్యత పెరుగుతోందని. ఉపాధి కల్పనలో లోటు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విమర్శలను నాగేశ్వరన్ త్రోసిపుచ్చారు. ఇండియన్ కార్పొరేట్, ఫైనాన్షియల్ రంగాలు గత దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న బ్యాలెన్స్ షీట్ ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయని అన్నారు. బ్యాంకుల్లో రెండంకెల రుణ వృద్ధి నమోదవుతోందని, కంపెనీల పెట్టుబడులు ప్రారంభమయ్యాయని ఒక ఆర్టికల్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment