న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా దేశ ఆర్థిక పురోగతి గణాంకాలపై ఆధారపడి కదిలే వీలుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వివరాలు గురువారం(30న) వెల్లడికానున్నాయి. అక్టోబర్ నెలకు మౌలిక సదుపాయాల గణాంకాలు సైతం ఇదే రోజు విడుదలకానున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.
కాగా.. గురువారం నవంబర్ డెరివేటివ్స్ సిరీస్ గడువు ముగియనుంది. శుక్రవారం(డిసెంబర్ 1న) తయారీ రంగ పనితీరు వెల్లడించే నవంబర్ పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. స్థూల ఆర్థిక గణాంకాలతోపాటు, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులకు అనుగుణంగా ట్రెండ్ ఏర్పడే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు.
ఇతర అంశాలూ కీలకమే..
ఆరు ప్రధాన కరెన్సీలతో డాలరు మారకంతోపాటు.. దేశీయంగా రూపాయి కదలికలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 83.38వరకూ నీరసించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ముడిచమురు ధరలు, యూఎస్ బాండ్ల ఈల్డ్స్‌కు సైతం ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మీనా తెలియజేశారు.
నవంబర్ నెలకు వాహన విక్రయ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో వారాంతాన ఆటో రంగ దిగ్గజాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అర్వీందర్ సింగ్ నందా తెలియజేశారు. వీటికితోడు యూఎస్ జీడీపీ, యూఎస్ పీఎంఐ, చమురు నిల్వలు, యూరోజోన్ సీపీఐ తదితర గణాంకాలు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు.
వడ్డీ రేట్ల ప్రభావం
గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. హెచ్చుతగ్గుల మధ్య నికరంగా సెన్సెక్స్ 175 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు చొప్పున పుంజుకున్నాయి. అయితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు లేదా పెట్టుబడులు ఈ వారం కొంతమేర ప్రభావం చూపనున్నట్లు మీనా పేర్కొన్నారు.
యూఎస్‌లో అంచనాలకంటే అధికంగా ద్రవ్యోల్బణం తగ్గడంతో మార్కెట్లలో విశ్వాసం నెలకొననున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు యోచనను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో పదేళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ రెండు వారాల క్రితం నమోదైన 5 శాతం నుంచి 4.4 శాతానికి దిగివచ్చాయి. వెరసి దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల అమ్మకాలు నెమ్మదించవచ్చని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment