న్యూఢిల్లీ : దేశం నలుమూలల వ్యాక్సిన్లు రవాణా చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మారుమూల ప్రాంతాలకు సైతం సకాలంలో టీకాలు చేరేలా కొత్త ప్రణాళిక రూపొందించింది. ఎత్తైన కొండ ప్రాంతాలు, దట్టమైన అడవుల్లో ఉన్న జనావాసాల దగ్గరకు వ్యాక్సిన్లు రవాణా చేసేందుకు డ్రోన్లు ఉపయోగించాలని నిర్ణయించింది.
ఆసక్తి వ్యక్తీకరణ
వ్యాక్సిన్ల డెలివరీకి ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి కేంద్రం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో రూపొందించిన నిబంధనల ప్రకారం... ఎంపిక చేసిన కమాండ్ స్టేషన్ నుంచి 35 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒక్కో డ్రోన్ల ద్వారా గరిష్టంగా నాలుగు కేజీల బరువు వరకు వ్యాక్సిన్లు ఇతర సామగ్రిని తరలించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. వ్యాక్సిన్లు డెలివరీ చేసిన తర్వాత తిరిగి కమాండ్ స్టేషన్‌లో డ్రోన్లు రిపోర్టు చేయాలని కేంద్రం సూచించింది.
ఐఐటీ కాన్పూరు, ఐసీఎంఆర్ సంయుక్తంగా
ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటీ, కాన్పూరు) , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా డ్రోన్ల సాయంతో అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికల్ (UAV) ప్రోటోకాల్‌ని సిద్ధం చేసింది. దాని ప్రకారమే వ్యాక్సిన్ డ్రోన్ డెలివరీ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కేంద్రం ఆహ్వానించింది.
అన్ని ప్రాంతాలకు
వాహనాల ద్వారా చేరుకోవడానికి కష్టంగా ఉండే ప్రాంతాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు డ్రోన్లను ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సిన్ల డెలివరీ ద్వారా భవిష్యత్తులో డ్రోన్ల ద్వారా ఔషధాల సరఫరాకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.
తెలంగాణలో
డ్రోన్ డెలివరీకి సంబంధించిన విధానాన్ని బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS)గా పేర్కొంటూ ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఈ విధానంలో వ్యాక్సిన్లు, ఇతర అత్యవసర ఔషధాలు డెలివరీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్లిప్‌కార్ట్, డూన్జోలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment