ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయంలో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ సంగతేంటో చూడాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయానికి ప్రభుత్వం సూచనలను అందించింది. ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించి తమకు, అభ్యర్థులకు అప్‌డేట్‌లను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర కార్మిక శాఖ కోరింది.
ఇన్ఫోసిస్ 2022లో ఆఫర్ లెటర్ ఇచ్చిన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఆన్‌బోర్డింగ్ తేదీలలో సర్దుబాటు చేసినప్పటికీ, ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్‌లను గౌరవిస్తామని, అందిరినీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ హామీ ఇచ్చారు. 2024 జూన్ నాటికి 315,000 మంది ఉద్యోగులతో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఒక ప్రధానమైన శక్తిగా ఉంది.
2,000 మంది గ్రాడ్యుయేట్‌లను ఇన్ఫోసిస్ ఆలస్యంగా ఆన్‌బోర్డింగ్ చేయడంపై ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్ అయిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నుండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు ఫిర్యాదు అందింది.
ఈ వారం ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్‌లకు కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లను పంపడం ప్రారంభించింది. మైసూర్‌లో చేరడానికి అక్టోబర్ 7ను షెడ్యూల్ తేదీగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment