
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. యూఎస్ తన సుంకాల విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతిచర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కొన్నేళ్లుగా ఇరుదేశాలతో వాణిజ్య చర్చల్లో కుదిరిన ప్రయోజనాలను, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా చాలా కాలంగా ఎంతో లాభం పొందిందనే వాస్తవాన్ని అమెరికా విస్మరించిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సరఫరా గొలుసులను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో చైనా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పింది. తన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇదీ చదవండి: ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!
ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌పై చైనా విధించిన 20% సుంకాల కంటే అదనంగా చైనాపై 34% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దాంతో మొత్తం సుంకాలు 54%కు పెరిగినట్లయింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ ప్రచారం చేసినట్టుగానే చైనాపై 60% సుంకాలు విధింపునకు సమీపంలోకి చేరింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే తక్కువ విలువ కలిగిన ‘డ్యూటీ ఫ్రీ(సుంకాలు మినహాయింపు)’ వస్తువులను అమెరికాలోకి అనుమతించే వాణిజ్య విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.