ఎలక్ట్రిక్ కార్లకు కేర్ ఆఫ్ అడ్రస్ టెస్లా. ఈ కంపెనీకి చెందిన కార్లు అమ్మకాల విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తాయి. ఇప్పుడు ఆ కంపెనీ పోటీగా చైనాకు చెందిన ఒక ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో దూసుకెళ్తుంది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ 3కి వులింగ్ హాంగ్ గ్వాంగ్ మినీ కారు చైనాలో గట్టి పోటీని ఇస్తుంది. చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్(సీపీసీఏ) గణాంకాల ప్రకారం.. ఈ పొట్టి ఎలక్ట్రిక్ కారు 2021లో టెస్లా మోడల్ వైని అధిగమించింది. చైనాలో 2021లో 3,95,451 యూనిట్ల గ్వాంగ్ మినీ ఎలక్ట్రిక్ కార్లను సంస్థ విక్రయించింది.
కంపెనీ జూన్ 2020 నుంచి కేవలం 19 నెలల్లో 5,00,000 యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది. ఈ చైనీస్ కంపెనీ టెస్లా విక్రయించిన మొత్తం(3,20,743) యూనిట్ల కంటే ఎక్కువగా ఈ కార్లను విక్రయించినట్లు తెలిపింది. డిసెంబర్ 2021లో 50,000 యూనిట్లకు పైగా అమ్ముడైన ఏకైక ఎలక్ట్రిక్ వాహనం అని సీపీసీఏ తెలిపింది. ఈ చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ డిసెంబర్ 2021లో 50,561 యూనిట్లను విక్రయించడం ద్వారా చైనాలో ఆల్ టైమ్ నెలవారీ రికార్డును సాధించింది.
2021లో చైనాలో 187,227 యూనిట్లు విక్రయించిన రెండో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా బైడ్ క్విన్ నిలిచింది. టెస్లా మోడల్ 3 150,890 యూనిట్లతో మూడవ స్థానంలో నిలచింది. గత ఏడాది డిసెంబర్ నెలలో 30,102 యూనిట్ల టెస్లా మోడల్ 3 కార్లను విక్రయిస్తే, మోడల్ వై 40,500 యూనిట్లను విక్రయించింది. టెస్లా మోడల్ 3 అమ్మకాలు 2020లో ఇదే నెలతో పోలిస్తే గత నెలలో 26.5 శాతం పెరిగింది.
ధర రూ.3 లక్షలు
గ్వాంగ్ మినీ ఈవీ కారును సంస్థ చైనాలో 28,800 యువాన్లకు(దాదాపు రూ.3.35 లక్షలు) విక్రయిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్లు(దాదాపు 106 మైళ్ళు) వరకు వెళ్లనుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని ఎస్ఎఐసి మోటార్, వులింగ్ మోటార్స్, యుఎస్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ఉమ్మడి భాగస్వామ్యంలో భాగంగా ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును తయారు చేశారు. స్థానికంగా దీనిని కేవలం వులింగ్ అని పిలుస్తారు.
(చదవండి: ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. ఇక ముందుగానే ఖాతాలోకి పెన్షన్!)
Comments
Please login to add a commentAdd a comment