
న్యూఢిల్లీ: బొగ్గు గనుల వేలానికి భారీ స్పందన కనిపించింది. ఏడో విడత బొగ్గు గనుల వేలంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 103 బ్లాకులను ఆఫర్ చేసింది. 18 బొగ్గు గనులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలసి 35 బిడ్లు దాఖలైనట్టు బొగ్గు శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి టెక్నికల్ బిడ్లను బుధవారం తెరిచారు.
ఎన్‌టీపీసీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా, జేఎస్‌పీఎల్ తదితర 22 కంపెనీలు వేలంలో పోటీ పడుతున్నాయి. 18 బొగ్గు గనుల్లో 9 పాక్షికంగా బొగ్గు అన్వేషించినవి. మిగిలిన గనుల్లో అన్వేషణ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించారు. వీటి ద్వారా ఏటా 51.80 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చు.
17 నాన్ కోకింగ్ కోల్ కాగా, ఒకటి కోకింగ్ కోల్‌మైన్. జేఎస్‌పీఎల్, ఎన్‌ఎల్‌సీ ఇండియా, బజ్‌రంగ్ పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జీఎండీసీ), బుల్ మైనింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఒక్కోటీ మూడు బ్లాకులకు బిడ్లు వేశాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ మైనింగ్, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ ఒక్కోటీ రెండు కోల్ బ్లాక్‌ల కోసం పోటీ పడుతున్నాయి. నల్వా స్టీల్ అండ్ పవర్, నువోకో విస్టాస్ కార్ప్, ఒడిశా కోల్ అండ్ పవర్ తదితర 14 కంపెనీలు ఒక్కో బ్లాక్ కోసం బిడ్లు దాఖలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment